
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఐసెట్-2023 అడ్మిషన్ల కౌన్సిలింగ్ మొదటి దశ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్, ఐసెట్ కన్వీనర్ కె రామ్మోహన రావు బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఈ నెల 8 నుంచి 14 వరకు ఉంటుందని వెల్లడించారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ 9 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తామని వివరించారు. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ 19 నుంచి 21 వరకు ఉంటుందని, 22వ తేదీ ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉందని తెలిపారు. వికలాంగ, స్పోర్స్ట్, ఎన్‌సిసి, ఆంగ్లో ఇండియన్స్ వారికి విజయవాడలోని ఆంధ్రా లయోల కళాశాలలో ఈ నెల 12న సర్టిఫికేట్ల వెరిఫకేషన్ ఉంటుందని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు ఈ నెల 25న ఉంటుందని అడ్మిషన్లు పొందిన విద్యార్ధులు ఇదే నెల 26 లోపు రిపోర్టు చేయాలని వివరించారు. ఈ నెల 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.