
- పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు
- కోనసీమలో విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర ప్రారంభం
ప్రజాశక్తి - అమలాపురం(డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా) : విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన 'విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర'ను సోమవారం అమలాపురం జడ్‌పి బాలుర హైస్కూల్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఐవి మాట్లాడుతూ.. విద్యార్థులు పోరాట పటిమను అలవర్చుకోవాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ర్థులకు వెంటనే పాఠ్యపుస్తకాలను అందించాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించవద్దని కోరారు. హైస్కూల్స్‌లో స్వీపర్ల తొలగింపు సరికాదన్నారు. వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌స్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. హాస్టళ్లల్లో రెగ్యులర్‌గా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, అధ్వాన స్థితిలో ఉన్న వసతిగృహాలను పునర్‌నిర్మించాలని, అమలాపురంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ యాత్రలో నాయకులు మదన్, ప్రణీత్‌సాయి, శంకర్, సంజన తదితరులు పాల్గొన్నారు.