వరుసగా తొమ్మిదవ సంవత్సరం జపాన్ తన మిలిటరీ బడ్జెట్‌ను పెంచింది. 2021 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపుదల 52 బిలియన్ డాలర్లకు చేరింది. అమెరికాతో రక్షణ ఒప్పందం వుండి, ఆత్మరక్షణకు మాత్రమే పరిమిత ఆయుధాలు, ఏర్పాట్లు వుండాల్సిన జపాన్ పూర్తి స్ధాయిలో యుద్ధానికి వినియోగించే జెట్ బాంబర్లు, దీర్ఘశ్రేణి క్షిపణులను, యుద్ధ నౌకలు, విమానవాహక యుద్ధ నౌకలను సమకూర్చుకుంటున్నది. ఆత్మ రక్షణకు రక్షణ పేరుతో జరుగుతున్న ఈ చర్యలు ఆ ప్రాంతంలోని రష్యా, చైనాలను రెచ్చగొట్టేందుకు, ఆయుధ పోటీకి దారితీయవచ్చని భావిస్తున్నారు. తాజా పెంపుదలతో ప్రపంచంలో మిలిటరీ బడ్జెట్ అగ్ర దేశాలలో జపాన్ పదవ స్ధానానికి చేరింది.
రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల చేతుల్లో ఓడిపోయిన జపాన్ మరోసారి మిలిటరీ శక్తిగా ఎదగకుండా చూసేందుకు మిలిటరీని రద్దు చేస్తూ పోట్స్ డామ్ సమావేశం నిర్ణయించింది. శాంతి ఒప్పందం ప్రకారం జపాన్ ఇతర దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకోవచ్చు, ఆత్మరక్షణ చర్యలు తీసుకోవచ్చు. అయితే తరువాత అమెరికా తన షరతుల మేరకు జపాన్‌తో రక్షణ ఒప్పందాన్ని రుద్దింది. దాని ప్రకారం జపాన్‌లో అమెరికా మిలిటరీ తిష్టవేసింది.
అయితే ఇంతవరకు ఏ దేశమూ జపాన్ మీద దాడి చేయలేదు. అలాంటి సూచికలు కూడా లేవు. అయినా గత కొద్ది సంవత్సరాలు జపాన్ తన మిలిటరీ శక్తిని పెంచుకుంటూ వస్తోంది. అమెరికాతో రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకొని స్వతంత్ర మిలిటరీ శక్తిగా ఎదగాలనే డిమాండ్ కార్పొరేట్ శక్తుల నుంచి పెరుగుతోంది. ఇదే సమయంలో తన కంటే మెరుగైన ఆర్థిక స్థితిలో ఉన్న జపాన్‌ను ఒక వైపు తమ అదుపులో ఉంచుకుంటూనే దానికి తమ ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఎత్తుగడను అమెరికా యుద్ధ పరిశ్రమ ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే అదునుగా భావించి ఆయుధాల కొనుగోలుతో పాటు స్వంతంగా ఆయుధాల తయారీకి జపాన్ శ్రీకారం చుట్టింది. గతంలో వాణిజ్యం విషయంలో వివాద పడి సర్దుబాటు చేసుకున్న ఈ రెండు దేశాల మధ్య మిలిటరీ చర్యలు ఏ పర్యవసానాలకు దారితీస్తాయో చూడాలి. అమెరికా నాయకత్వాన ఆస్ట్రేలియా, భారత్‌తో కలసి చతుష్టయం పేరుతో జపాన్ ఒక మిలిటరీ కూటమి ఏర్పాటుకు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. మిలిటరీ బడ్జెట్ పెంపు దీనిలో భాగమే అని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా నుంచి క్షిపణులు, విమానాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ స్ధానికంగా తయారీకి కూడా ప్రాజెక్టులను ప్రారంభించింది.
కొద్ది మంది సిబ్బందితో దాడులు చేయగలిగిన రెండు యుద్ధ నావల తయారీకి 91 కోట్ల డాలర్లను బడ్జెట్‌లో కేటాయించారు. క్షిపణుల తయారీ లేదా కొనుగోలు ఇతర దేశాల మీద దాడులకు ఉద్దేశించినవి, ఆత్మరక్షణ విధానానికి అనుకూలమైన రాజ్యాంగానికి వ్యతిరేకమైన పరిణామాలని జపాన్ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశ నైరుతి దీవుల చుట్టూ చైనా నౌకా దళ కార్యకలాపాలకు స్పందనగా, దేశ ఆత్మరక్షణ దళాల రక్షణ కోసం క్షిపణులు కీలకమని రక్షణ మంత్రి నోబు కిషి సమర్ధించుకున్నారు. ఐదు సంవత్సరాలలో యుద్ధ నావల నిర్మాణం, క్షిపణి పరిశోధనలు పూర్తవుతాయని, ఇప్పటికే 900 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను తాకే వాటిని అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారు. తమ గగనతలంపై ఎగిరే సూపర్‌సోనిక్ విమానాలను పసిగట్టేందుకు అవసరమైన టెలిస్కోప్‌లు, పర్యవేక్షణ వ్యవస్ధల పరిశోధనలకు నిధులు కేటాయించారు. టోకియో లోని టకుషోకు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హెయిగో నాగీ మాట్లాడుతూ స్వయం రక్షణకు జపాన్ మరింత బాధ్యత వహించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ఒత్తిడి కూడా మిలిటరీ బడ్జెట్ పెంపుదలకు ఒక కారణం అన్నారు. రక్షణ బడ్జెట్ పెంచకూడదనే రోజులు పోయాయన్నారు.
నాటో కూటమి ఖర్చులో ఎక్కువ మొత్తాన్ని ఐరోపా దేశాలు భరించాలని ఒత్తిడి చేసినట్లే...జపాన్‌తో రక్షణ ఒప్పందం ఉన్నప్పటికీ రక్షణ బడ్జెట్ పెంపుదల ఒత్తిడి వెనుక అమెరికా యుద్ధ పరిశ్రమల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. జపాన్‌కు వంద ఎఫ్-35 రకం యుద్ధ విమానాలను విక్రయించాలని జూలై నెలలో నిర్ణయించారు. పలు అమెరికా ఆయుధ పరిశ్రమలు జపాన్ ఆయుధ తయారీలో భాగస్వాములు కావాలని చూస్తున్నాయి. కరోనాకు ముందే అమెరికా ఆర్థిక వ్యవస్ధ సమస్యలను ఎదుర్కొంటుండగా కరోనా కాలంలో తీవ్రంగా దెబ్బ తిన్నదని...అందువలన తూర్పు ఆసియాలో తన తరఫున ప్రాంతీయ భద్రతా పెంపుదల చర్యలకు జపాన్ ఎక్కువగా ఖర్చు చేయాలనే ఒత్తిడి పెంచుతున్నట్లు భావిస్తున్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత గణనీయంగా పుంజుకున్నప్పటి నుంచి తిరిగి ప్రపంచ రాజకీయాల్లో పాత్ర పోషించటం ద్వారా తమ మార్కెట్‌ను పెంచుకోవాలని జపాన్ చూస్తోంది. దానికి మిలిటరీ శక్తి ఒక సాధనం అన్నది తెలిసిందే. దానిలో భాగంగానే కార్పొరేట్లు రాజ్యాంగాన్ని సవరించి పూర్తి స్ధాయి మిలిటరీని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తున్నాయి. అయితే రక్షణ ఒప్పందం పేరుతో తన గుప్పెట్లో ఉన్న జపాన్ మరోసారి తనకు పోటీనిచ్చే మిలిటరీ శక్తిగా ఎదగాలని అమెరికా కోరుకోవటం లేదు. ఆసియాలో తన అనుయాయిగా ఉంచుకొనేందుకే ప్రాధాన్యత ఇస్తున్నది. గతంలో ఒక సామ్రాజ్య శక్తిగా పెత్తనం చేసినపుడు లబ్ధి పొందిన కార్పొరేట్లు అమెరికా, ఇతర దేశాల నుంచి ఆయుధాల కొనుగోలుకు బదులు తామే వాటిని తయారు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాయి. ఇప్పుడు చైనా, ఉత్తర కొరియాలను బూచిగా చూపి తమ మిలిటరీ బడ్జెట్‌ను పెంచుకుంటున్నాయి. ఒక వైపు అమెరికా మరోవైపు స్వంత కార్పొరేట్ల ఒత్తిడిని అక్కడి పాలకవర్గం ఏ విధంగా సమన్వయ పరుస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు అమెరికాను తోసిరాజనే స్ధితి లేనప్పటికీ దానికి బాటలు వేస్తోందన్నది బడ్జెట్ కేటాయింపులే చెబుతున్నాయి.
* ఎం. కోటేశ్వరరావు










