Jul 09,2023 15:51
  • 1300 రోజులకు చేరిన అమరావతి ఉద్యమం

ప్రజాశక్తి - తుళ్లూరు : రాజధాని అమరావతిని ఎవరూ కదల్చలేరని, రైతులదే విజయమని మాజీ ఎంపి, రైతు నాయకులు వడ్డే శోభానాద్రీశ్వర రావు అన్నారు. అమరావతి మహోద్యమం 1300 రోజులకు చేరిన సందర్భంగా ఆదివారం మందడం రైతు దీక్షా శిబిరంలో 'నాలుగేళ్ల నరకంలో నవ నగరం' పేరుతో సభ నిర్వహించారు. సభలో శోభనాధీశ్వర రావు మాట్లాడుతూ గతంలో కోర్టులను ఆశ్రయించే సందర్భంలోనే అమరావతిని ఎవరూ కదల్చలేరని చెప్పానని, ఇప్పుడు కోర్టులు కూడా అమరావతికి అనుకూలంగా తీర్పులు ఇచ్చాయని చెప్పారు. పలు వాయిదాల తరవాత సుప్రీం కోర్టులో కూడా అమరావతికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.జగన్ కోర్టు తీర్పులను లెక్క చేయకుండా మొండిగా ముందుకు వెళుతున్నారని ఆక్షేపణ వ్యక్తం చేశారు. జగన్ కు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వభావం కాకుండా తాత రాజారెడ్డిది వచ్చిందన్నారు. జగన్ సిఎం పదవికి తగిన వ్యక్తి కాదన్నారు.మహిళా రైతుల పోరాటం అద్వితీయ మైందని కొనియాడారు. 
మాజీ మంత్రి, టిడిపి నాయకులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతం లో రాజధాని నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం,  అమరావతి నిర్మాణానికి రైతులు 33వేల ఎకరాలు ఇవ్వడం, ఉద్యమం, అరెస్టులు, నిర్భందాలు చరిత్రలో నిలిచి పోతాయన్నారు. జగన్ దుర్మార్గపు పాలనకు తెర పడాలంటే రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాల్చిన అవసరం ఉందన్నారు.అమరావతి అంశం 175 నియోజక వర్గాల్లో ప్రధాన ఎజెండాగా నిలవాలన్నారు. జగన్ ను అధికారం నుంచి తొలగిస్తే జైలుకి పోతారన్నారు. నేరస్తుడిని సిఎం చేస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ అమరావతి పట్ల బిజెపి మద్దతుతో వైసిపి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు. అమరావతికి అన్ని పార్టీలు మద్దతుగా ఉన్నాయనే భ్రమలో ఉండరాదన్నారు.  ప్రధాని మోడీ అమరావతి నిర్మాణానికి చేసిన శంకుస్థాపన శిలాఫలకంను వైసిపి మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు చేస్తుంటే  బిజెపి గానీ, అమిత్ షా గానీ ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. ఆర్- 5 జోన్ లో సెంటు స్థలం పంపిణీ పేదలపై ప్రేమ వల్ల కాదన్నారు. రానున్న ఎన్నికలు జగన్ రావాలా.. పోవాలా.. అనే ఎజెండాతో జరుగుతాయన్నారు. సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి మాట్లాడుతూ ఎనిమిది బడ్జెట్లలో నిధులు కేటాయించకుండా కేంద్రం అమరావతి పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించడం దారుణ మన్నారు. రాష్ట్రానికి రావాల్చిన నిధులను రాబట్టుకునేందుకు  కేంద్రాన్ని నిలదీసే  పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. రాజధాని అమరావతికి సిపిఎం కట్టుబడి ఉందని చెప్పారు. ఇప్పటికైనా అమరావతే రాజధానని సిఎం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. కాంగ్రెస్స్ పార్టీ వర్కింగ్ కమిటీ నాయకులు మస్తాన్ వలీ మాట్లాడుతూ అమరావతి ఉద్యమానికి కాంగ్రెస్స్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. తొలుత అమరావతి అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అమరావతి జెఏసి సమన్వయ కమిటీ సభ్యులు పువ్వాడ సుధాకరరావు, శివారెడ్డి, బార్ అసోషియేషన్ నాయకులు సుంకర రాజేంద్ర ప్రసాద్ దళిత బహుజన పరిరక్షణ సమితి నాయకులు పోతుల బాల కోటయ్య, బిజెపి నాయకులు దారా సాంబయ్య, చిగురుపాటి రవీంద్ర బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, టిడిపి నాయకులు పిల్లి మాణిక్య రావు, మైనర్ బాబు, రజని, చిలకా బసవయ్య,  పాల్గొన్నారు.