Sep 13,2023 21:03
  • వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలి
  • ఎఐకెఎంకెఎస్‌ జాతీయ గిరిజన సదస్సులో తీర్మాణం

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : పోలవరం నిర్వాసితులకు సమగ్ర, శాస్త్రీయ పునరావాసం కల్పించాలని, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అటవీ సంరక్షణ చట్ట సవరణను రద్దు చేయాలని జాతీయ గిరిజన సదస్సులో వక్తలు తీర్మానించారు. ఆల్‌ ఇండియా కేత్‌ మజ్దూర్‌ కిసాన్‌ సభ (ఎఐకెఎంకెఎస్‌) ఆధ్వర్యంలో విశాఖలోని సుబ్బలక్ష్మి కల్యాణ మండపంలో జరుగుతున్న జాతీయ గిరిజన సదస్సు బుధవారానికి రెండో రోజుకు చేరింది. ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి కార్పొరేట్ల ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. పేదలు, గిరిజనుల కష్టాలు మోడీ సర్కారుకు పట్టడం లేదన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను ఐక్య పోరాటాలతో ఎలా తిప్పికొట్టిందో వివరించారు. ప్రస్తుత అటవీ పరిరక్షణ (సవరణ) చట్టం ప్రజానీకానికి, పర్యావరణానికి ప్రమాదకరమైందని తెలిపారు. హైకోర్టు న్యాయవాది పల్లా త్రినాధరావు మాట్లాడుతూ అడవిపై ఆదివాసుల జీవనం, సంస్కృతి ఆధారపడి ఉన్నాయని, ప్రస్తుత చట్ట సవరణతో వారికి ముప్పు ముంచుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు అడవులను ఆదాయ వనరులుగా చేస్తూ అనేక మినహాయింపులతో కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ పాలకులు సముద్రం, భూమి, అడవిపై ఆధిపత్యం కోసం చట్టాలు చేస్తున్నారని అన్నారు. అటవీ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం పాలకులపై ఉద్యమించాలని కోరారు. సదస్సులో ఆలిండియా ట్రైబల్‌ ఇంటలెక్చువల్‌ ఫోరం ప్రధాన కార్యదర్శి ఘాసీరాం, ఎఐకెఎంకెఎస్‌ కో - కన్వీనర్‌ ఎస్‌ ఝాన్సీ, జాతీయ సభ్యులు శ్రీకాంత్‌ మహంతి (ఒడిశా), వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.