- మణిపూర్ ఘటనలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర సిఎం రాజీనామా చేయాలి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రైతుల పంట రుణ బకాయిలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పర్యాయం రద్దు చేయాలని, రైతు రుణ ఉపశమన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించేలా కృషి చేయాలని ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనరు వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. రైతుల, కౌలురైతుల ఆత్మహత్యలు లేకుండా వారిని కాపాడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో బుధవారం వడ్డే శోభనాద్రీశ్వరరావు అధ్యక్షతన రైతు సంఘాల సమావేశం జరిగింది. ఈ నెల 30న విజయవాడ పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగే రాష్ట్ర సదస్సుకు ఆలిండియా కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్, ఉపాధ్యక్షులు హన్నన్‌మొల్లా, ఎఐకెఎంఎస్ జాతీయ కార్యదర్శి ఎస్ రాజారామ్‌సింగ్, కెకెయు జాతీయ కార్యదర్శి రామీంద్రసింగ్ పాటియాల, ఎఐకెఎంఎస్ జాతీయ అధ్యక్షులు సత్యవాన్, కాంగ్రెస్ కిసాన్‌సేన జాతీయ అధ్యక్షులు సుఖ్‌పాల్‌సింగ్ ఖైరా, ఎన్‌ఎపిఎం జాతీయ నాయకులు మేథాపాట్కర్, అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి వెంకట్, కిసాన్‌సభ జాతీయ కార్యదర్శి పివి సుందరరామరాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్ ఘోయల్, ఎఐపికెఎస్ జాతీయ నాయకులు ఆర్ చంద్రశేఖర్ హాజరవుతారన్నారు.
రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఎంతమాత్రం న్యాయసమ్మతం కాదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులు మంజూరు చేయడంతోపాటు ఆదివాసీ గిరిజనులు, దళితులు, బాధిత ప్రజలకు ఇబ్బంది కలగకుండా పునరావాస పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన ఎంపి బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ అక్కడ సిఎం తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ మాట్లాడుతూ.. వర్షాలు, వరదలు, తుపానుల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, రైతులు విత్తనాలు నాటుకునేందుకు అవసరమైన ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ మోటార్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించరాదన్నారు.
ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య మాట్లాడుతూ.. పంటలన్నిటికీ సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి సి2ప్లస్ 50 శాతం కలిపి చట్టబద్ధత, కనీస మద్ధతు ధరలను నిర్ణయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాగృతి రైతు సంఘం రాష్ట్ర నాయకులు మరీదుప్రసాద్, ఎపి కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, రైతు సంఘం నాయకులు కొలనుకొండ శివాజీ, కె కోటయ్య, కోగంటి ప్రసాద్ పాల్గొన్నారు.