Aug 15,2023 21:30
  • ఆగస్టు 24న 'చలో ఢిల్లీ'ని జయప్రదం చేయాలి
  • రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు

ప్రజాశక్తి- యంత్రాంగం : కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రెండో దశ రైతు పోరాటానికి సన్నద్ధం కావాలి, ఈ నెల 24న చేపట్టిన 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎపి రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగాన్ని తెగనమ్మడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం దుర్మార్గమన్నారు. విజయవాడలోని స్వతంత్య్ర సమరయోధుల సీనియర్‌ సిటిజన్స్‌ కార్యాలయంలో జాతీయ జెండాను రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు ఆవిష్కరించారు. దేశ స్వాతంత్య్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ, మోడీ కో హటావో.. దేశ్‌ కో బచావో నినాదంతో 77వ స్వతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు మంగళవారం చేపట్టిన ఈ కార్యక్రమంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, సహజ వనరులను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోందని, అందులో భాగంగానే మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చిందని తెలిపారు. రైతాంగం నిర్వహించిన చారిత్రాత్మక పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, అయితే, అవే చట్టాలను దొడ్డిదారిన మళ్లీ తీసుకురావడానికి ప్రయత్నిస్తుండడం మోసగించడమేనని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర, రైతు రుణమాఫీ తదితర అంశాలపై పోరాడుతున్న వారిపై అక్రమంగా కేసులు పెడుతుండడం దారుణమని తెలిపారు. మణిపూర్‌లోనూ, హర్యానాలోనూ మత మరణకాండను సృష్టించి దేశ సమగ్రతకు, మతసామరస్యతకు భంగం కలిగిస్తోందని విమర్శించారు. స్వతంత్య్ర సమరయోధుల సీనియర్‌ సిటిజన్స్‌ కార్యాలయ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్‌, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, ఎఐకెఎఫ్‌ రాష్ట్ర నాయకులు కాసాని గణేష్‌, ఎపి రైతు సంఘం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి పి.వి.ఆంజనేయులు, రైతు సంఘం నాయకులు కోగంటి ప్రసాదు, కోగంటి కోటయ్య, సుంకర మురళి తదితరులు పాల్గొన్నారు.
సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం), కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్‌ సెంటర్‌లోని బిఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 'మోడీని సాగనంపుదాం... దేశాన్ని కాపాడుకుందాం, మతసామరస్యం, లౌకికతత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఎఐకెకెఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు డి.రంగనాథ్‌, ఐఎఫ్‌టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌, బికెఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌, ఎఐటియుసి జిల్లా నాయకులు కె.కృష్ణమాచార్యులు, ఐఎఫ్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు తదితరులు ప్రసంగించారు.