ప్రజాశక్తి-మార్టూరు రూరల్ (బాపట్ల జిల్లా):సాగునీరు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని, సాగునీరిచ్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు కందిమళ్ల రామకోటేశ్వరరావు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా మార్టూరు, బల్లికురవ, యద్దనపూడి మండలాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల దెబ్బతిన్న పంటలను రైతుసంఘం నాయకులు మంగళవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. పలువురు రైతులు మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తీవ్ర వర్షాభావం వల్ల పంటలు దక్కే పరిస్థితి లేకుండాపోయిందని, అప్పులు తీరే మార్గం కనుచూపు మేరలో కనిపించడంలేదని రైతు సంఘం నాయకుల ఎదుట వాపోయారు. ఈ సందర్బంగా రైతులను ఉద్దేశించి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యుత్ కోతలు లేకుండా తొమ్మిది గంటలు నిరంతరాయంగా నాణ్యమైన కరెంట్ వ్యవసాయానికి ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులపై అప్పుల భారం పెరిగిందని, పంటలు పూర్తయ్యేంత వరకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించి సాగునీరు ఇవ్వాలని కోరారు. పంట నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.