- నీటి హక్కులను కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి
- 12న మంత్రి అంబటికి వినతిపత్రం, 'సుప్రీం'లో న్యాయ పోరాటం
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కృష్ణా జలాల పున:పంపిణీపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు దారి తీసేలా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అధికారాన్ని కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం - ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. కేంద్రంలో అధికారంలోనున్న బిజెపి ప్రభుత్వం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రంపై మరోసారి తమ అక్కసు వెళ్లగక్కుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని రౌండ్‌టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 12న రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబును కలిసి వినతిపత్రం ఇవ్వాలని, న్యాయ పోరాటంలో భాగంగా సుప్రీంకోర్టులో రైతు, కౌలు రైతుసంఘాల తరపున ఇంప్లీడ్ కావడం, ప్రజలను చైతన్య పరచి ప్రత్యక్ష పోరాటంలో విద్యార్థులు, యువత, రైతాంగం, మేధావులు అందరినీ కలుపుకుని ఉద్యమించాలని నిర్ణయించింది. ఇరిగేషన్‌శాఖలో ఉద్యోగ విరమణ పొందిన ఇంజినీర్లు, నిష్ణాతుల సలహాలు, సూచనలు స్వీకరించి పోరాటం ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంతోపాటు, భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటించాలని సమావేశం తీర్మానించింది.
రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనరు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సందర్భంగా కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి కేంద్రం సమక్షంలో ఇరు రాష్ట్రాలు అంగీకరించిన దానికి భిన్నంగా తెలంగాణ ఎన్నికల సమయంలో బిజెపి కేవలం తమ రాజకీయ స్వార్థంతో చేసిన చర్యగా ఆయన అభివర్ణించారు. కృష్ణా నదీ జలాల పునర్విభజనపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు రెఫర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌కు వ్యతిరేకంగా అన్ని రైతు సంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని నిలదీయాలని, అఖిలపక్ష భేటీని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎన్నికలు ఎక్కడుంటే ఆ ప్రాంతంలో ప్రజలకు ఏదో ఒరగబెడుతున్నట్లు నాటకాలు ఆడటంలో బిజెపిని మించిన పార్టీ ఏదీ లేదన్నారు. గతంలో కర్ణాటకలో ఎన్నికల సమయంలో అప్పర్ భద్ర నిర్మాణానికి రూ.5,300 కోట్లు ప్రకటించిందని, త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండటంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అదనపు అధికారాలిస్తూ గెజిట్ ఇచ్చిందని అన్నారు. సాగునీటి ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా బిజెపి కుట్రలపై సుప్రీంకోర్టుకు వెళదామని సూచించారు. ఒకసారి పంపిణీ అయిన నీటిని మళ్లీ పంపిణీ చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు.
రైతు సంఘాల సీనియర్ నాయకులు వై కేశవరావు, ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. బిజెపి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల ట్రిబ్యునల్ ముసుగులో జల వివాదాలు సృష్టిస్తోందన్నారు. కేంద్రంలోని బిజెపి విధానాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంత పాడటం మానేయాలన్నారు. శ్రీశైలం, సాగర్ ఆయకట్టు ప్రాంతాల రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని గ్రహించాలన్నారు.
ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిలబడాలన్నారు. కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వడమంటే రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేయడమేనన్నారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు మిరియం వెంకటేశ్వర్లు, కిసాన్ కాంగ్రెస్ నాయకులు జె గురుమూర్తి, కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి, సిఐటియు రాష్ట్ర నాయకులు డి దయామణి, సోషల్ జస్టిస్ ఫోరమ్ ఛైర్మన్ తులసీరామ్, ఎస్కాన్ ఛైర్మన్ ఎస్‌ఎ రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.