- కోర్టును ఆశ్రయించిన వారికే చెల్లింపులు
- సిఐడి దర్యాప్తుతో అసైన్డు భూములకు రెండేళ్లుగా నిలిపివేత
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని నిర్మాణం కోసం తొమ్మిదేళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు ప్రతి ఏటా ఇచ్చే వార్షిక కౌలు అందజేయడంలో గత మూడేళ్లుగా తీవ్ర జాప్యం జరుగుతోంది. 2016 నుంచి 2019 వరకు ఏటా ఏప్రిల్ నుంచి మే చివరిలోగా వార్షిక కౌలు సొమ్ము రైతుల ఖాతాల్లో జమయ్యేది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2020 నుంచి ఏటా జూన్ నుంచి ఆగస్టులోగా జమ చేస్తూ వచ్చింది. ఈ ఏడాది ఇంత వరకు రైతుల ఖాతాల్లో వార్షిక కౌలు జమ కాలేదు. తమకు కౌలు సొమ్ము రాలేదని కోర్టును ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారికి మాత్రమే కౌలు చెల్లింపులు జరుగుతున్నాయి. మంగళగిరి మండలంలో టిడిపి నాయకులు పోతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైతులు పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో దాదాపు 2,400 మందికి ఈ ఏడాది వార్షిక కౌలు జమైంది. మిగతా వారికి ఇంతవరకూ జమకాలేదు. కోర్టులో పిటిషన్ వేయగానే సంబంధిత పిటిషన్‌దారులకు కౌలు చెల్లిస్తున్న సిఆర్‌డిఎ అధికారులు... మిగతా వారి గురించి పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రాజధాని నిర్మాణ నిమిత్తం 2015లో సిఆర్‌డిఎకు భూములు అప్పగించిన 22,736 మంది రైతులకు పదేళ్లపాటు ఏటా పది శాతం పెంచేలా అప్పటి టిడిపి ప్రభుత్వం రాజధాని రైతులకు కౌలు సాయం ప్రకటించింది. మెట్ట భూములకు ఎకరాకు రూ.30 వేలు, మూడు పంటలు పండే జరీబు భూముల రైతులకు ఎకరాకు రూ.50 వేలు కౌలు అప్పటి టిడిపి ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మొత్తంపై ఏటా పది శాతం సొమ్ము పెంచి రైతుల ఖాతాల్లో జమయ్యేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోన్నా, చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ సమీకరణలో 22,736 మంది రైతులు 33,717 ఎకరాల భూములు ఇవ్వగా, వీరికి 2015 నుంచి 2019 వరకు సకాలంలో కౌలు డబ్బులు వారి ఖాతాల్లో జమయ్యాయి. 2020 నుంచి ఏటా జాప్యం జరుగుతోంది. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారికి మాత్రమే 2021 నుంచి ఏటా రైతులకు కౌలు సాయం అందిస్తున్నారు. ఈ ఏడాది మేలో ఇవ్వాల్సిన కౌలు సొమ్ము ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. గత రెండేళ్లుగా అసైన్డు రైతులకు కూడా కౌలు పరిహారం నిలిచిపోయింది. 29 గ్రామాల్లో మూడు వేల మంది అసైన్డు రైతులు ఉన్నారు. వీరి భూములు కూడా రాజధానికి తీసుకున్నారు. అసైన్డు భూముల అప్పగింతలో అక్రమాలు జరిగాయని సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తు పెండింగ్‌లో ఉండడంతో మూడు వేల మంది అసైన్డు రైతులకు కౌలు పరిహారం నిలిపివేశారు. ఏ భూమి వివాదంలో ఉంటే ఆ భూమికి పరిహారం నిలిపివేయాలని, అందరికీ నిలిపివేయడం సరికాదని అసైన్డు రైతులు గత రెండుళ్లుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
- వెంటనే చెల్లించాలి
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు వెంటనే వార్షిక కౌలు చెల్లించాలి. మేలో ఇవ్వాల్సిన కౌలు సొమ్ము ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దారుణం. అసైన్డు రైతులకు కౌలు సొమ్ము రెండేళ్లుగా నిలిపివేయడం తగదు. ఒకటి రెండు భూములకు సంబంధించి వివాదం ఉంటే, వారికి ఆపాలని కానీ, మూడు వేల మంది అసైన్డు రైతులకూ కౌలు సొమ్ము ఇవ్వకపోవడం సరికాదు. సిఐడి దర్యాప్తు పేరుతో బడుగు, బలహీన వర్గాల రైతులను ఇబ్బంది పెడుతున్నారు.
- ఎం.రవి, సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి