- రాష్ట్ర వ్యాప్తంగా 731 మందికి ఉద్వాసన
- జీతాలివ్వలేమంటూ పంచాయతీరాజ్ శాఖ నోటీసులు
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : పంచాయతీరాజ్‌లో టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారిపై ప్రభుత్వం వేటు వేసింది. ఇక నుంచి జీతాలివ్వడం సాధ్యం కాదని పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నుంచి అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజినీర్లకు ఆదేశాలు అందాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 731 మంది అవుట్‌సోర్సింగ్ సిబ్బందిపై వేటు పడనుంది. వీరందరూ 13 సంవత్సరాలుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కింద విధులు నిర్వహిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద వీరిని జిల్లా స్థాయిలో డిస్ట్రిక్టు కంప్యూటర్ సెంటరు (డిసిసి)ల్లో పనిచేయడానికి 2009లో 721 మందిని నియమించారు. వీరందరూ ప్రధానంగా పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో పనిచేస్తూ వచ్చారు. ఈ శాఖ పరిధిలో జరిగే రహదారులు, డ్రెయినేజీ తదితర పనులను పర్యవేక్షణ చేస్తారు. గతేడాది ఉపాధి హామీ పథకం వెబ్‌సైట్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. గతంలో పర్యవేక్షణ చేస్తున్న టిసిఎస్ కాకుండా ఎన్‌ఐసికి బదిలీ చేసింది. దీంతో ఈ పని కోసం నియమితులైన కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 14 నెలలుగా బకాయిలున్న వేతనాలన్నింటీనీ గత నెలలో చెల్లింపులు చేసేసింది. ఇకపై మీరు ఉద్యోగానికి రావద్దని, మిమ్మల్ని తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ డివిజనల్ స్థాయి అధికారులకు జులై 15న ఉత్తర్వులు అందజేశారు. దీంతో ఒక్కసారిగా టెక్నికల్ అసిస్టెంట్లు వీధినపడ్డారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న శాఖల్లో తమను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు అందరూ డిప్లొమో, కంప్యూటర్ ఆపరేటర్లు అందరూ డిగ్రీతోపాటు పిజిడిసిఎ చేసిన వారున్నారు.
కుటుంబాలు గడవడం కష్టం : ప్రసాద్, ఎపి పంచాయతీరాజ్ సైట్ ఇంజనీర్స్, టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్
ఈ ఉద్యోగం చేస్తున్న వారంతా డిగ్రీ, డిప్లొమో పూర్తి చేసినవారు. 2009లో వైఎస్. రాజశేఖర్‌రెడ్డి సిఎంగా ఉన్న సమయంలోనే మాకు ఉద్యోగాలు వచ్చాయి. ఉన్న ఫలంగా పనిలేదంటూ బయటకు పంపిస్తే ఎలా బతకాలి. కుటుంబాలన్నీ దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కనీసం ఎంసిసి మండల కంప్యూటర్ సెంటర్లలో ఖాళీగానున్న పోస్టుల్లో మమ్మల్ని సర్దుబాటు చేయాలని కోరుతున్నాం. ఈ విషయాన్ని అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం ఆలోచించి మాకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరుతున్నాం.