-సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
- ఈ నెల 20న అన్ని చోట్లా సమ్మె నోటీసులు
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో:అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని, ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ డిసెంబరు ఎనిమిదో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు అంగన్‌వాడీ వర్కర్ల సంఘాలు ప్రకటించాయి. శుక్రవారం ఉదయం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఎఐటియుసి) ప్రధాన కార్యదర్శి జె లలిత, ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ప్రధాన కార్యదర్శి విఆర్ జ్యోతి మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులతో చర్చించినప్పటికీ చలనం లేదని అన్నారు. దీనిపై గురువారం కమిషనరుకు సమ్మె నోటీసు ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20న పిడి, సిడిపిఒలకు సమ్మె నోటీసు ఇవ్వాలని కోరారు. 23న అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 25 నుంచి 30 వరకూ సెక్టార్ సమావేశాల్లో సమ్మెకు సంబంధించిన సమాచారాన్ని వర్కర్లు అందరికీ సమాచారం అందించాలని తెలిపారు. డిసెంబరు ఆరో తేదీన అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు సమస్యలతో కూడిన వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అంగన్‌వాడీలను చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని ప్రకటించారని, ఇంత వరకు అమలు చేయలేదని వివరించారు. మినీ టీచర్లందరినీ మెయిన్ టీచర్లుగా వెంటనే గుర్తించాలని, విధుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షలు ఇవ్వాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు ఎనిమిదో తేదీ నుంచి సమ్మెలోకి వెళతామని హెచ్చరించారు. 48 ఏళ్ల నుంచి స్త్రీ, శిశుసంక్షేమశాఖలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు గౌరవ వేతనం పేరుతో వెట్టి చాకిరీకి గురవుతున్నారని తెలిపారు. వారికి ఇఎస్‌ఐ, ఇన్సూరెన్స్, పెన్షన్, గ్రాడ్యూటీ సౌకర్యాలు లేకుండా రోజురోజుకూ యాప్స్ పేరుతో పనిభారం పెంచుతున్నారని వివరించారు. అనేక పర్యాయాలు ప్రత్యక్షంగా నిరసన ప్రదర్శనలు చేశామని, ముఖ్యమంత్రి, ఆయా శాఖల మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లకు వినతిపత్రాలు ఇచ్చామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు మండలిలో చర్చించారని, రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టామని పేర్కొన్నారు. గతనెల తొమ్మిదో తేదీన కమిషనర్‌తోనూ చర్చించామని, కానీ ఒక్క అడుగూ ముందుకు పడలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హక్కుల సాధన కోసం అనివార్య పరిస్థితుల్లో సమ్మెలోకి వెళుతున్నామని వారు తెలిపారు. విలేకరుల సమావేశంలో వేర్వేరు సంఘాల నాయకులు ఎన్‌సిహెచ్ సుప్రజ, ప్రేమ తదితరులు పాల్గోన్నారు.