Nov 15,2023 09:23

అమరావతి : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్‌ తమిళనాడు విభాగ ఛైర్మన్‌ పదవికి సంబంధించి జరిగిన మోసం కేసులో సినీనటి నమిత భర్త చౌదరి సహా ఇద్దరు విచారణకు హాజరు కావాల్సిందిగా సేలం సెంట్రల్‌ క్రైం బ్రాంచి సమన్లు పంపింది. పరిశ్రమల కౌన్సిల్‌ తమిళనాడు విభాగ అధ్యక్షుడి పదవి ఇప్పిస్తామంటూ సేలం నగరానికి చెందిన ముత్తురామన్‌ జిల్లాలోని అమ్మాపాళయం జాకిర్‌ ప్రాంతానికి చెందిన గోపాల్‌స్వామి వద్ద రూ.50 లక్షల నగదు తీసుకుని మోసం చేశాడు. ఆ పదవికి నమిత భర్త చౌదరి ఇటీవల నియామకమయ్యారు. తాను మోసపోయినట్లు గోపాల్‌స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముత్తురామన్‌తో పాటు కౌన్సిల్‌ జాతీయ కార్యదర్శి దుశ్యంత్‌ యాదవ్‌ను గత 31న అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్‌ తమిళనాడు విభాగ అధ్యక్షుడు చౌదరితో పాటు ముత్తురామన్‌ సహాయకుడు, బిజెపి రాష్ట్ర మీడియా విభాగ ఉపాధ్యక్షుడు మంజునాథ్‌ కూడా విచారణకు హాజరవ్వాలంటూ సూరమంగళం పోలీసులు సమన్లు పంపారు. ఆ ఇద్దరూ హాజరు కాలేదని తెలిసింది. ఈ పరిస్థితుల్లో విచారణను మంగళవారం సేలం నగర సెంట్రల్‌ క్రైం బ్రాంచికి బదిలీ చేసినట్లు తెలిసింది.