కమ్ముకున్న చీకటికి జెప్పి కోడిగుయ్యకముందే
బాయికాడికెళ్ళి పంటను జూసేదాకా
పాణమే ఆగదాయే.
కాడెడ్లను మందలించి
కాడిమాకుతో బంధం గలిపిన దాక
ఆరోజు తెల్లారినట్టే ఉండదు
ఆచారితాత జెక్కిన నాగలి
భూతల్లికి మొక్కుతుంటే
సాలు సాలుకు విత్తనమవుతావు .
కారెచెమట బొట్టుని ఆపి, వానబొట్టుకోసం ఎదురుచూపాయే.
చినుకువాసన రాగానే
కోడి పిల్లలలాగ విత్తనం కోసం ఉరుకులాట,
అప్పుజేసి తెచ్చిన విత్తనాన్ని
ఒడిలోపోసి, భూతల్లికి అప్పజెప్పితే
మిత్తిలు పెరిగిన కానీ వేసిన పంట కుదరకపాయె.
సకాలంలో రాని వాన
ఆకాలంలో కురిసి ఆశలు చంపే
సర్కారు ఏది మారినగానీ
నీ ఫికరు మార్చకపోయే
కల్లంలో పోసిన రాశికి మొక్కితే
తాలూధాన్యంతో దీవించింది
కాపలాగాసి పుట్లు పోసింది
హంసబియ్యమే గానీ
రేషన్ బియ్యమే నీ కడుపునింపు,
నువ్వు కార్చిన చెమట చుక్కనే
ఈ దేశానికి అన్నం మెతుకు.
చేసిన అప్పులు తీర్చలేవని ఉరితాడు
నీతో పెట్టిన పందెంలో గెలిచింది,
రైతే రాజు అంటారేగానీ రాణిని ఇవ్వడానికి
ముందుకి రారేందుకు
గాసం పండించడమే ఎరుకగాని
మోసం ఎరుగని అమాయకుడవు గదా నీవు
* పల్లె రాజు, 9666207288