Jul 18,2023 14:46

కారకాస్‌ : ప్రపంచ కవితోత్సవం యొక్క 17వ ఎడిషన్‌ని వెనిజులా ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది. ఈ కవితోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుండి 70 మంది రచయితలు, 200 మంది స్థానిక కవులు పాల్గొన్నారు. వెనిజులా రాజధాని కారకాస్‌లో జూలై 17 నుండి 23వ తేదీ వరకు కొనసాగే ఈ కవితోత్సవాన్ని వెనిజులా సాంస్కృతిక శాఖామంత్రి ఎర్నెస్టో విల్లెగాస్‌ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ... 'వెనిజులా రాజకీయ నాయకుడు, గాయకుడు, కవి ఫ్రెడ్డీ ఆనెజ్‌తో కలిసి ఈ కవితోత్సవంలో భాగస్వామ్యమవ్వడం ఎంతో ఆనందంగా వుందని' ఆయన అన్నారు. ఈ కవితోత్సవానికి హాజరైనవారు ముగింపు రోజున ఈ కార్యక్రమానికి సంబంధించి క్లుప్తంగా ఆరు లైన్లలో వివరించాలని అధికారులు సూచించారు. ఇక ఈ సందర్భంగా గ్రూపు చర్చల్లో పాల్గొన్న అంశాలపై ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందని కవి అనా మారియా ఒవిడో తెలిపారు. ఈ నేపథ్యంలో వెనిజులా దేశవ్యాప్తంగా ఉన్న 23 రాష్ట్రాల్లోని 12 రాష్ట్రాల్లో కవితా పఠనాలు, సాహిత్య వర్క్‌షాప్‌లు జరుగుతున్నాయి. వెనిజులా రచయిత పెడ్రో రూయిజ్‌ రాసిన 'కాన్‌ ఎల్‌ రియో ఎ లా ఎస్పాల్డా' పుస్తక ప్రదర్శనతో ఈ కవితోత్సవం ముగుస్తుంది.