ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : తెలంగాణలోనే తొలి గజల్ కవయిత్రి బైరి ఇందిర (60) కేన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లో ఆదివారం కన్నుమూశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన బైరి ఆమె తాను చూసిన అనుభవంలోనుంచి వచ్చిన ఉదంతాలకు అక్షర రూపమిచ్చి కథానికలుగా తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర తొలి గజల్ కవయిత్రిగా ఆమె పేరుపొందారు. 1962 డిసెంబర్ 19న బైరి రమణమ్మ, రామూ3ర్తిలకు ఇందిర జన్మించారు. ఇల్లెందులోని జెడ్‌పిహెచ్‌ఎస్ సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేశారు. ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రవృత్తిగా సాహిత్యాన్ని చివరి వరకూ సమాజహితానికి అందించారు. 1998లో 'తేనెల పలుకు' కవిత్వానికి ఆస్ట్రేలియా అంతర్జాతీయ అవార్డు లభించింది. 2016లో విజయవాడ మానస సాహిత్య ఆకాడమీ జాతీయ స్థాయి అవార్డు దక్కింది. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో అంటేవుర్ రాష్ట్ర స్థాయి సాహిత్య అవార్డు, 2013లో కొత్తగూడెం 'చిగురు సాహిత్య అకాడమీ' నానో విభాగంలో అవార్డులు లభించాయి. 2016లో తొలి 'తెలంగాణ గజల్ కావ్యం' అచ్చయింది. ఇందిరకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్గె హిమజ కూడా గజల్ గాయని. నిజాంపేటలోని ఇందిర నివాసంలో భౌతికకాయానికి తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి, నాయకులు అనంతోజు మోహన్ కృష్ణ, సలీమ నివాళులర్పించారు. ఇందిర మరణం సాహితీ లోకానికి తీరనిలోటని వారు పేర్కొన్నారు. ఇందిర మృతికి సాహితి స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి, అధ్యక్ష, కార్యదర్శులు కెంగార మోహన్, సత్యరంజన్, సాహిత్య ప్రస్థానం వర్కింగ్ ఎడిటర్ సత్యాజీ సంతాపం తెలిపారు.