Nov 22,2023 10:53

తిరువనంతపురం : సిపిఐ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌ రామచంద్రన్‌ (71) మంగళవారం కొచ్చిలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో మరణించారు. ఆయనకు భార్య ప్రియదర్శిని, కుమార్తె దీప ఉన్నారు. సిపిఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులుగా ఉన్న రామచంద్రన్‌ కొల్లం జిల్లా కార్యదర్శిగా, వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్‌) జిల్లా కన్వీనర్‌గా, కేరళ చిన్న తరహా పరిశ్రమల అభివృధ్ధి సంస్థ (సిడ్కో) ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. విద్యార్థి దశలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్‌)లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీగా పని చేశారు. 1978లో సిపిఐ కరునాగపల్లి తాలూకా కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2000లో కొల్లం జిల్లా పంచాయత్‌కు ఎన్నికై ఆ తర్వాత 2004లో ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2016లో కరునాగపల్లి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే 2021 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి సిఆర్‌ మహేశ్‌ (కాంగ్రెస్‌) చేతిలో ఓడిపోయారు. ప్రజాసందర్శనార్థం రామచంద్రన్‌ భౌతికకాయాన్ని ఛావరా, కరునాగపల్లి మండల కమిటీ కార్యాలయాలకు తరించి నివాళులర్పించిన అనంతరం ఆయన నివాసం వద్దే శనివారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.