Nov 20,2023 08:03

అమెరికా : అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ భార్య రోజ్లిన్‌ కార్టర్‌ (96) ఆదివారం స్వగృహంలో కన్నుమూశారు. ఆమె మృతిపై అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ మాట్లాడుతూ ... ' నేను ఇప్పటివరకూ ఏది సాధించినా దానివెనుక రోజ్లిన్‌ నాకు అండగా నిలిచారు. నేను నిరాశకు గురైనప్పుడల్లా, ఆమె నాకు ప్రోత్సాహాన్ని అందించారు. నాకు నిరంతరం మంచి సలహాలు ఇచ్చేవారు. ఆమె నాకు ఉత్తమ సలహాదారు ' అని పేర్కొన్నారు.

0111


గత ఏడాది (2022) మే నెలలో ఆమెకు డిమెన్షియా అనే వ్యాధి సోకడంతో ఆమె చికిత్స పొందుతున్నారు. అయితే గత ఫిబ్రవరి నుంచి ఆమెకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. జిమ్మీ తన పదవీకాలంలో ఇజ్రాయెల్‌- ఈజిప్టు మధ్య శాంతి ఒప్పందం కుదిర్చారు. ఈ విజయంపై ప్రపంచ వేదికపై ఆయనకు ప్రశంసలు అందాయి. మరోవైపు ద్రవ్యోల్బణం, ఇరాన్‌ వివాదాల కారణంగా జిమ్మీ పలు విమర్శలను ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజ్లిన్‌ తన భర్తకు అండగా నిలిచారు. ప్రపంచ శాంతి, మానవ హక్కుల కోసం కార్టర్‌ దంపతులు కార్టర్‌ సెంటర్‌ అనే సంస్థను స్థాపించారు. జిమ్మీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ దంపతులు క్యూబా, సూడాన్‌, ఉత్తర కొరియాలను సందర్శించారు. జిమ్మీ కార్టర్‌కు 2002లో నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది. 1999లో నాటి అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌.. కార్టర్‌ దంపతులను అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌తో సత్కరించారు.