Nov 10,2023 10:40

ప్రజాశక్తి - విజయవాడ/ అమరావతి బ్యూరో : విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) నగర ప్రధాన కార్యదర్శి మన్నం డేవిడ్‌ (66) గురువారం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. సింగ్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఆయన గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తన ముగ్గురు కుమార్తెలకు ఉద్యమ నేతలైన ఐలమ్మ, స్వరాజ్యం, ఉదయం పేర్లు పెట్టారు. డేవిడ్‌ భార్య బుజ్జమ్మ కండ్రిక ప్రాంతంలో మున్సిపల్‌ కార్మికురాలిగా పని చేస్తున్నారు. డేవిడ్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులుగా, జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. 1983లో సిపిఎం సభ్యుడిగా చేరిన ఆయన 2014 నుంచి విజయవాడ సెంట్రల్‌ సిటీ కమిటీ సభ్యులుగా, పార్టీ పూర్తికాలం కార్యకర్తగా పని చేశారు. 1998లో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మలేరియా విభాగంలో వర్కర్‌గా చేరారు. అనంతరం యూనియన్‌ బాధ్యతలు చూస్తూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడారు.
 

                                                                           పలువురు సంతాపం

డేవిడ్‌ మృతి ఉద్యమానికి తీరని లోటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఆయన మృతికి సంతాపంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మస్టర్‌ పాయింట్లలో సంతాపం వ్యక్తం చేయాలని ఉమామహేశ్వరరావు సూచించారు.