Jan 16,2021 07:02

వాట్సాప్‌ తీసుకొస్తున్న కొత్త ప్రైవసీ పాలసీ తీవ్ర ఆందోళన కలగిస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది వినియోగదారులు వినియోగిస్తున్న ఈ యాప్‌ బెదిరింపు ధోరణితో తీసుకొస్తున్న ఈ పాలసీపై కేంద్రం ప్రభుత్వం నోరు మెదపకపోవడం మరీ ఆందోళనకరం. వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ ఈ నెల 4న వెలుగులోకి వచ్చింది. వచ్చే నెల 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆలోగా ప్రస్తుత వినియోగదారులు నూతన ప్రైవసీ పాలసీని అంగీకరించి అప్‌డేట్‌ చేసుకోకపోతే ఇక వాట్సాప్‌ ను వినియోగించే వీలు వారికి ఉండదు. ఒక వేళ అప్‌డేట్‌ చేసుకుంటే తదుపరి జరిగే పరిణామాలకు వారిదే బాధ్యత. నూతన ప్రైవసీ పాలసీలో తామేమీ ఎటువంటి చౌర్యానికి పాల్పడబోమని, వ్యక్తిగత సమాచారాన్ని తాము సేకరించబోమని వాట్సాప్‌ ప్రకటన విడుదల చేసినా...అది కళ్లు మూసుకొని పాలు తాగే పిల్లిని తలపిస్తోందే కానీ వాస్తవాన్ని ప్రతిబింబించడం లేదు.


ప్రస్తుతమున్న ప్రైవసీ పాలసీ ప్రకారం వాట్సాప్‌ లో పొందుపరిచే సమాచారమేదీ ఇతరులకు తెలిసే వీల్లేదు. తమ సమాచారాన్ని ఇతరులతో షేర్‌ చేసుకోవడం అనేది పూర్తిగా వినియోగదారుల ఐచ్ఛికమైన అంశం. ఇప్పుడు అలా కాదు. అది పూర్తిగా ఫేస్‌బుక్‌ గుత్తాధిపత్య గ్రూపు సంస్థల వశం కానుంది. అంటే ఇప్పుడు మనం వాట్సాప్‌ లో పొందుపర్చే సమాచారం కానీ షేర్‌ చేసుకునే అంశాలు కానీ సమస్తం వాట్సాప్‌ మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్‌కూ, ఆ సంస్థతో ఒప్పందం చేసుకునే థర్డ్‌ పార్టీ యాప్స్‌కూ అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇలాంటి వ్యవహారానికి సోషల్‌ మీడియా కార్పొరేట్‌ కంపెనీలు పెట్టుకున్న ముద్దుపేరు 'మెటా డేటా'. దీనర్ధం ఏమిటంటే మన ఆన్‌లైన్‌ కార్యకలాపాలను ఒక క్రమపద్ధతిలో పర్యవేక్షిస్తూ, కాలానుగుణంగా వివిధ రకాల యాడ్స్‌, అభిప్రాయ సేకరణల పేరుతో అవసరమైన డేటాను సేకరించి వాటిని వివిధ రకాల కేటగిరీలు, టేబుళ్లు, గ్రాఫుల రూపంలో విశ్లేషించి మెటా డేటాను రూపొందిస్తాయన్నమాట. దీనినే 360 'ప్రొఫైల్‌ వ్యూ' అని కూడా అంటారు.


సాధారణంగా స్నేహితులతోనూ, సహచర ఉద్యోగులతోనూ, కుటుంబ సభ్యులతోనూ సమాచారాన్ని పంచుకోవడానికే వినియోగిస్తాం. మనం మన ఫోన్‌ నంబరు, ఇతర వివరాలను కేవలం ఈ అవసరం కోసమే అందజేస్తాం. కానీ ఇప్పుడు దీనిని వాట్సాప్‌ తన బిజినెస్‌ అవసరాలకు వాడుకునేందుకు మన అనుమతి కోరుతోంది. తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తోనూ, ఇతర యాప్స్‌తోనూ పంచుకుంటామని తేల్చి చెబుతోంది. అనుమతి ఇవ్వకపోతే వాట్సాప్‌ వినియోగించుకునే వీల్లేదని బెదిరిస్తోంది. డేటా చౌర్యానికి పాల్పడుతామని బహిరంగంగా వాట్సాప్‌ ప్రకటించి 'దోపిడి'కి అనుమతి కోరుతున్నామంటూ ప్రైవసీ పాలసీని విడుదల చేసినా కేంద్ర ప్రభుత్వం కూడా చేష్టలుడిగి మిన్నుకుండిపోయింది. ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌బర్గ్‌ రిలయన్స్‌లో ఇటీవలే భారీ పెట్టుబడులు పెట్టడమే దీనికి కారణం. రిలయన్స్‌ అధిపతి ముఖేష్‌ అంబానీ 'జియో' ప్రారంభ సమయంలో 'డేటా ఈజ్‌ న్యూ ఆయిల్‌' (సమాచారమే కొత్త చమురు) అన్నారు. వాట్సాప్‌ కొత్త పాలసీలో వ్యాపార, వాణిజ్య, రాజకీయ ఎజెండా దాగున్నదన్నది సుస్పష్టం. ఇప్పుడు విరివిగా వినియోగంలో ఉన్న ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఈ మూడు కూడా ఫేస్‌బుక్‌ సంస్థవే. గతంలో ఇదే ఫేస్‌బుక్‌ సంస్థ 'బేసిక్స్‌' పేరుతో ఇంటర్నెట్‌ తటస్థత (నెట్‌ న్యూట్రాలిటి)పై కత్తిగడితే 'స్వేచ్ఛ' లాంటి స్వచ్ఛంద సంస్థలు తిప్పికొట్టాయి. ఇప్పుడు దొడ్డిదారిన మళ్లీ అలాంటి ప్రయత్నాలే వాట్సాప్‌ పాలసీ రూపంలో ముందుకొస్తున్నాయి.


మన దేశంలో పౌరుల వ్యక్తిగత సమాచార రక్షణ చాలా పరిమితమైనది. ఈ విషయమై సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చినా, మోడీ ప్రభుత్వం దానికి ఇంతవరకూ చట్ట రూపం కల్పించలేదు. యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో కాస్త పటిష్టమైన చట్టాలున్నాయి. వాట్సాప్‌ తీసుకొచ్చిన ప్రస్తుత ప్రైవసీ పాలసీ ఆ దేశాల్లో అమల్లోకి రావడం కుదరదు. వాస్తవానికి కొన్ని ఇ.యు దేశాల్లో వాట్సాప్‌ ను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేయడమే నేరమని నిర్ధారించి జరిమానాలు విధించారు కూడా. మరికొన్ని దేశాల్లో ఈ వ్యవహారం ఇంకా కోర్టుల్లో కొనసాగుతోంది. కార్పొరేట్‌ కంపెనీల సేవల్లో తరిస్తున్న మోడీ సర్కార్‌ నుండి మన ప్రైవసీకి రక్షణ దొరుకుతుందని ఆశించలేం. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ లకు ప్రత్యామ్నాయంగా ఇప్పటికే టెలిగ్రామ్‌, సిగల్‌ వంటి యాప్‌లను వినియోగించడం ప్రజలు వేగవంతం చేశారు. ఇలాంటి ప్రత్యామ్నాయ వేదికలను బలపర్చి మన ప్రైవసీ హక్కును కాపాడుకుందాం.