Jul 09,2023 08:55

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌... కొత్త కొత్త ఫీచర్లతో తన వినియోగదార్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విండోస్‌ ఓఎస్‌ వినియోగదార్లకు వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఏకంగా 32 మంది వ్యక్తులు ఒకేసారి వీడియో కాల్‌లో మాట్లాడుకునేలా ఒక సరికొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది. వినియోగదార్లను ఖుషీ చేసే ఈ ఫీచర్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, కొంతమంది లక్కీ బీటా వెర్షన్‌లో ఇప్పటికే ఈ ఫీచర్‌ అందుబాటులో వుంది. ఇకపై గూగుల్‌ మీట్‌, జూమ్‌ వంటి టూల్స్‌తో అవసరం లేకుండానే ఒకేసారి 32 మందితో డెస్క్‌టాప్‌ నుంచి వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించుకోవచ్చు. గతంలో వాట్సాప్‌ గరిష్టంగా ఎనిమిది మందితో మాత్రమే గ్రూప్‌ వీడియో కాల్స్‌, 32 మంది వ్యక్తులతో ఆడియో కాల్స్‌కు సపోర్ట్‌ చేసేది.
అంతేకాకుండా.. వినియోగదారులు చాట్‌లో గానీ, గ్రూప్‌లో గానీ నిర్దిష్ట సమయం వరకు మెసేజ్‌ను పిన్‌ చేసుకోవచ్చు. పిన్‌ చేసుకున్న సమయం దాటగానే ఆటోమేటిక్‌గా ఆ మెసేజ్‌ అన్‌పిన్‌ అయిపోతుంది. ఒక నివేదిక ప్రకారం.. ఈ సరికొత్త ఫీచర్‌ ద్వారా పిన్‌ మెసేజ్‌ డ్యురేషన్‌ 24 గంటలు, 7 రోజులు, 30 రోజుల వ్యవధి ఉండేలా వాట్సాప్‌ ఆప్షన్స్‌ ఇవ్వనుందని సమాచారం. అవసరమైతే.. నిర్ణీత సమయం కంటే ముందే ఆయా మెసేజ్‌లను అన్‌పిన్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ వల్ల ముఖ్యమైన సమాచారాన్ని చాట్‌బాక్స్‌ పైన పిన్‌ చేసుకోడానికి వీలవుతుంది. అంటే.. ముఖ్యమైన సమాచారం మెసేజ్‌లన్నింటిలో కలిసిపోకుండా చాట్‌బాక్స్‌పైన కనిపిస్తుంది.