Jan 20,2021 06:45

ఫేస్‌బుక్‌ యజమానిగా 2014 నుండీ వున్న కంపెనీ వాట్సాప్‌. తన ఖాతాదారుల డేటా షేరింగ్‌కు సంబంధించిన నిబంధనలను మార్చుతూ ఒక కొత్త ప్రైవసీ విధానాన్ని వాట్సాప్‌ ప్రతిపాదించింది. ఇది ఫిబ్రవరి 8 నుండీ అమలులోకి వస్తుందని తొలుత తెలిపిన ఆ కంపెనీ దేశవ్యాప్తంగా వ్యక్తమైన వ్యతిరేకతతో మే నెల వరకూ వాయిదా వేసుకుంది. తన ఖాతాదారుల సంభాషణలు (చాట్లు), సంబంధాలు, ప్రాంతం, ఉపయోగించే పరికరం, లావాదేవీలు, చెల్లింపులు-వీటికి సంబంధించిన డేటాను తన యజమాని అయిన ఫేస్‌బుక్‌తో పంచుకోబోతున్నట్టు ఆ ప్రతిపాదనలో తెలిపింది. ఫేస్‌బుక్‌ను ఉపయోగించే ఇతర వ్యాపార సంస్థలతో కూడా మనకు సంబంధించిన డేటాను పంచుకోబోతున్నట్టు ప్రతిపాదించింది. ఈ ప్రకటనతో వాట్సాప్‌ వినియోగదారులలో కలకలం బయలుదేరింది. వారిలో చాలామంది తమ డేటా భద్రంగా ఉండే 'సిగ్న‌ల్‌' యాప్‌కు మారిపోతున్నారు. సిగల్‌, అటువంటి మరో సేఫ్‌ యాప్‌ అయిన 'టెలిగ్రామ్‌'లకు గత వారంలో పదుల లక్షల సంఖ్యలో వినియోగదారులు మారిపోయారు. అదే సమయంలో వాట్సాప్‌ ను కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకునేవారి సంఖ్య ఒక్కసారిగా పడిపోయింది. 


తన వినియోగదారులకు సంబంధించిన డేటాను వాట్సాప్‌ 2016 నుండే ఫేస్‌బుక్‌తో పంచుకోవడం ప్రారంభించింది. 2014లో యాజమాన్యం ఫేస్‌బుక్‌ చేతుల్లోకి పోతున్నప్పుడు తన ఖాతాదారులకు వాట్సాప్‌ ఇచ్చిన హామీకి ఇది విరుద్ధం. 2016లో తన ఖాతాదారుల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకోనున్నట్టు తెలుపుతూ అందుకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే వారి డేటాను పంచుకోబోమని చెప్తూ అభ్యంతరాలను నమోదు చేయడానికి కేవలం 30 రోజుల గడువు ఇచ్చింది. 


ఆ తర్వాత ఎవరైనా వాట్సాప్‌లో చేరాలంటే మొత్తం 8000 పదాలున్న ఒప్పంద పాఠాన్ని పూర్తిగా చదివి అందులో ఫేస్‌బుక్‌తో డేటాను పంచుకునే క్లాజులను గుర్తించి ఆ క్లాజు తమకు వర్తింపజేయరాదని తెలియజేయాలి. ఎవరూ అంత ఓపికగా ఆ ఒప్పంద పాఠాన్ని చదవరని, పూర్తిగా చదవకుండానే తమ ఆమోదాన్ని తెలుపుతారని అందరికీ తెలుసు. ఆ విధంగా వాట్సాప్‌ వినియోగదారులలో అత్యధికుల డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకోవడం ఇప్పటికే జరుగుతోంది. గతంలో కనీసం తమ డేటాను పంచుకోడానికి వీల్లేదని అభ్యంతరం చెప్పి తప్పుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు కొత్తగా ప్రతిపాదించిన పాలసీలో అటువంటి అవకాశమే లేదు. 2016లో ఫేస్‌బుక్‌ వాట్సాప్‌ వినియోగదారులకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా వాట్సాప్‌ ప్రైవసీ విధానాన్ని మార్చినప్పుడు దానికి నిరసనగా వాట్సాప్‌ సహ స్థాపకుడు బ్రియన్‌ ఏక్టన్‌ ఆ సంస్థ నుండి బైటకు వచ్చేశాడు. ఎటువంటి లాభాపేక్ష లేని 'సిగల్‌' ఫౌండేషన్‌ ను స్థాపించి 'సిగల్‌' యాప్‌ను సృష్టించాడు. ఇప్పుడు ఆ 'సిగ్న‌ల్‌' యాప్‌ వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచింది.


ఇటీవల ఫేస్‌బుక్‌ సంస్థ రిలయన్స్‌ జియో సంస్థలో 570 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇది రూపాయల్లో 42,750 కోట్లు. ఆ వెంటనే నవంబరు 2020లో ''వాట్సాప్‌ యుపిఐ'' అనే పేమెంట్‌ యాప్‌కు అనుమతులు పొందింది. భారతీయ నియంత్రణ సంస్థ నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పిసిఐ) వాట్సాప్‌ డేటాను ఫేస్‌బుక్‌ తో కలపకుండా వేరుగా ఉంచాలని ఆదేశించింది. కాని ఫేస్‌బుక్‌ ఈ షరతును అమలు చేయడం లేదు. ఇప్పుడు వాట్సాప్‌ తన డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకుంటానని ప్రకటించడం అంటే అది బాహాటంగా ఎన్‌పిసిఐ నిబంధనను ఉల్లంఘించడమే.
అదే యూరప్‌ దేశాల విషయంలో, బ్రిటన్‌ విషయంలో ఫేస్‌బుక్‌ తో వాట్సాప్‌ తన డేటాను పంచుకోవడంలేదు. ఆ దేశాల ప్రభుత్వాలు నిక్కచ్చిగా వ్యవహరించడం ఇందుకు కారణం. ఆ దేశాలలో తప్ప, అమెరికాతో సహా తక్కిన దేశాలలో వాట్సాప్‌ తన డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకుంటోంది. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో డేటా (సమాచారం) జీవనాడిలా ఉపయోగపడుతుంది.


ఇప్పుడు వాట్సాప్‌ కొత్త విధానానికి వ్యతిరేకత వెల్లువెత్తడంతో ఫేస్‌బుక్‌ నష్ట నివారణ చర్యలకు దిగింది. వాట్సాప్‌ ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజెస్‌ (ఒక వినియోగదారుడు ఇంకొకరికి పంపే సందేశాలు)ను ఫేస్‌బుక్‌తో గాని, ఇతర వ్యాపార సంస్థలతో గాని పంచుకోబోమని ప్రకటించారు. వాట్సాప్‌ యాప్‌ను విడిచిపెట్టి వెళ్తున్న లక్షలాది వినియోగదారులను బుజ్జగించే యత్నంలో భాగంగా దేశంలోని ప్రధాన వార్తాపత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలను వాట్సాప్‌ గుప్పించింది. అయితే ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజిలు మినహాయించి తక్కిన డేటాను తాను ఏం చేయబోతున్నదీ మాత్రం వాట్సాప్‌ స్పష్టంగా ప్రకటించలేదు. ఆ సంస్థ ప్రకటించిన విధానం ప్రకారం ఆ డేటానంతటినీ ఫేస్‌బుక్‌తోను, ఇతర వ్యాపార సంస్థలతోను పంచుకోనుంది. యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో వాట్సాప్‌ తను ఏయే డేటాను ఇతరులతో పంచుకోబోయేదీ స్పష్టంగా ప్రకటించింది. మనం చేసే కొనుగోళ్ళు, మన ఆర్థిక లావాదేవీల సమాచారం, మన లొకేషన్‌, మనకు ఎవరెవరితో కాంటాక్టులు ఉన్నాయో ఆ సమాచారం, మనం పంపే సమాచారం (కంటెంట్‌), మన గుర్తులు, మనం ఎందుకు వాట్సాప్‌ను వాడుతున్నామో ఆ సమాచారం, మన వైద్య పరీక్షల వివరాలు వంటివన్నీ ఇతరులతో వాట్సాప్‌ పంచుకోనుంది.
 

వ్యాపార లావాదేవీలలో చొరబాటు-గోప్యతకు భంగం
సుప్రీం కోర్టు గోప్యత ప్రతీ పౌరుడి ప్రాథమిక హక్కు అని స్పష్టంగా ప్రకటించింది. అయితే ఈ హక్కుకు చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యా తీసుకోలేదు. నిజానికి మనం ఇంకొకరితో జరిపే వ్యాపారపరమైన లావాదేవీ కూడా మన వ్యక్తిగతమైన అంశమే. దానిని గోప్యంగా ఉంచుకునే హక్కు మనకుంది. ఇటువంటి లావాదేవీల వివరాలను ఇతరులకు అందించడం మన గోప్యతకు భంగం కలిగించడమే అవుతుంది. ఇతర యాప్‌లతో వాట్సాప్‌ ద్వారా మనం జరిపే ఆర్థిక, వ్యాపార లావాదేవీలను పర్యవేక్షించడం ద్వారా వాట్సాప్‌ మన సంభాషణలనే గాక మన కార్యకలాపాలకు సంబంధించిన ఇతర వివరాలను కూడా సేకరించి షేర్‌ చేస్తుంది. ఉదాహరణకు మనం వాట్సాప్‌ ద్వారా ఒక సినిమాకు టికెట్లు బుక్‌ చేశామనుకోండి. లేదా ఇ-కామర్స్‌ యాప్‌ ద్వారా (అమెజాన్‌ వంటివి) మనం కొనుగోలు చేయదలచినప్పుడు అక్కడి నుండి మనకు ఇన్వాయిస్‌ పంపారనుకోండి. ఈ సమాచారాన్నంతటినీ వాట్సాప్‌ సేకరిస్తుంది. ఆ తర్వాత అటువంటి లావాదేవీలకు సంబంధించిన యాడ్‌లను మనకు వాట్సాప్‌ ద్వారా, ఫేస్‌బుక్‌ ద్వారా చూపడం ప్రారంభిస్తారు. ఏ కంపెనీల యాడ్‌లను చూపించాలన్నది నిర్ణయించే సంస్థగా వాట్సాప్‌ ఉంటుంది. తిరిగి ఆ వ్యాపార సంస్థలు మనతో జరిపే లావాదేవీల నుండి మనకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరిస్తుంది. ఇలా మనకు సంబంధించిన సమాచారం యావత్తూ వాట్సాప్‌ గుప్పెట్లోకి చేరుతుంది.
 

ప్రజాస్వామ్యానికి, గోప్యతకు ఫేస్‌బుక్‌ నుండి ముప్పు
ఇన్‌స్టాగ్రామ్‌ను, వాట్సాప్‌ ను కొనుగోలు చేసిన ఫేస్‌బుక్‌ సోషల్‌ మీడియాలో గుత్తాధిపత్యం కలిగిన సంస్థగా తయారైంది. వ్యక్తుల, సమూహాల సమాచారాన్ని తన లాభాల కోసం వాడుకుంటున్నది. వినియోగదారుడు ఎంతగా ఫేస్‌బుక్‌ను, ఇతర యాప్‌లను వాడతాడో అంతగా అతడి గోప్యత దెబ్బ తింటుంది. ఎంతగా అతడి గోప్యత దెబ్బ తింటుందో అంతగా ఫేస్‌బుక్‌ లాభాలు పెరుగుతాయి. సోషల్‌ మీడియాలో మన ప్రవర్తనను పర్యవేక్షించి, అదుపు చేసి తద్వారా తన గుత్తాధిపత్యాన్ని మరింత పెంచుకుంటూ పోతుంది. అంతేగాక, తన వద్ద ఉన్న సమాచారాన్ని ఆధారం చేసుకుని వ్యక్తులను, చిన్న చిన్న సమూహాలను లక్ష్యంగా పెట్టుకుని ప్రభావితం చేస్తుంది. వినియోగదారుల గోప్యతకు ఫేస్‌బుక్‌ భంగం కలిగించిందని ఆరోపిస్తూ ఇప్పటికి 46 ప్రభుత్వాలు కోర్టుల్లో కేసులు వేశాయి. కేంబ్రిడ్జ్‌ అనలిటికా, పెగాసస్‌ తమ పరిశోధనల ద్వారా ఫేస్‌బుక్‌, వాట్సప్‌ నుండి సమాచారం లీక్‌ అయిన వైనాలను బహిర్గతం చేశాయి. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ , ఇతర వ్యాపార సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాల పర్యవసానంగా ఈ డేటా లీక్‌లు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఒకసారి లీక్‌ అయ్యాక ఆ తర్వాత దాని నుండి మనం విడగొట్టుకోవడం సాధ్యం కాదు.


మన ప్రొఫైళ్ల నుండి, అభిరుచుల నుండి, సంభాషణల నుండి సేకరించిన వివరాల ఆధారంగా మనలను వివిధ రకాల సమూహాలుగా విభజించి, మన ప్రవర్తనను, ఎంపికను తమకు అనుగుణంగా మార్చేటందుకు ఎటువంటి యాడ్స్‌, ప్రచారం అవసరమో ఫేస్‌బుక్‌ నిర్ధారిస్తుంది. ఆ విధంగా ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిస్తుంది. అమెరికా ఎన్నికలలో, బ్రెగ్జిట్‌ ప్రచారంలో, ప్రజానీకాన్ని ఏవిధంగా ప్రభావితం చేసిందో చూశాం. మన దేశంలో ఎన్నికల ప్రక్రియలో కూడా ఇదే విధమైన పాత్రను పోషించింది. ఫేస్‌బుక్‌ వద్ద ఉన్న డేటాకి తోడు ఇప్పుడు వాట్సాప్‌ డేటా కూడా తోడైతే అది మన సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు పెను ముప్పుగా మారుతుంది.

వాట్సాప్‌-ఫేస్‌బుక్‌ చెప్తున్నదేమిటి? వాస్తవం ఏమిటి?- ఒక రియాలిటీ చెక్‌

  1. వాట్సాప్‌ చెప్తున్నది : మీ వ్యక్తిగత మెసేజిలను వాట్సాప్‌ చూడలేదు కనుక వాటిని ఫేస్‌బుక్‌తోగాని, వేరే మూడో వారితోగాని పంచుకోవడం అన్న ప్రశ్నే తలెత్తదు.

వాస్తవం : వాట్సాప్‌ మెసేజిలు ఒకరి నుండి ఇంకొకరికి నేరుగా పంపేవి గనుక వారిద్దరు మాత్రమే వాటిని చూడగలుగుతారని వాట్సాప్‌ అంటోంది. ఇది వాస్తవాన్ని కప్పిపుచ్చడమే. మనం వాట్సాప్‌ ద్వారా పంపే మెసేజిలను, షేర్‌ చేసే సమాచారాన్ని వాట్సాప్‌ క్రోడీకరించి తద్వారా మన అభిరుచులేమిటో, మన ప్రాధాన్యతలేమిటో గుర్తించి వాటికనుగుణంగా మనకు తరచూ సూచనలిస్తూ వుంటుంది. తమ యాప్‌ స్టోర్‌ ప్రకటనలో దీనినే వాళ్ళు మెటా డేటా అంటారు. ఆ విధంగా ఇప్పటికే వాట్సాప్‌ మన ప్రవర్తనను, అభిప్రాయాలను, అభిరుచులను గమనిస్తూ, వాటిని ప్రభావితం చేస్తూ వుంది. ఇది ఖచ్చితంగా మన వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమే.

2. వాట్సాప్‌ చెప్తున్నది : మీరు మీ లొకేషన్‌ను వేరేవారితో షేర్‌ చేసుకుంటే దానిని వాట్సప్‌ చూడలేదు.
వాస్తవం :
ఇది మరో పచ్చి అబద్ధం. మీరు వాట్సాప్‌కు లొకేషన్‌ గుర్తించడానికి అనుమతి ఇవ్వకపోయినా, మీ ఐ.పి అడ్రస్‌ ఆధారంగా మీ లొకేషన్‌ను గుర్తించి ఫేస్‌బుక్‌తో పంచుకోగలదు.
3. వాట్సాప్‌ చెప్తున్నది : మీకు గల సంబంధాలను (కాంటాక్టులు) వాట్సాప్‌ పంచుకోలేదు.
వాస్తవం :
వాట్సాప్‌ మీ ఫోను నంబర్లను అదే రూపంలో కాకుండా ఒక గూఢ లిపిలో (దీనినే క్రిప్టోగ్రాఫిక్‌ హ్యాష్‌ అంటారు) భద్రపరుస్తుంది. పైగా మీకు సంబంధించిన వివరాలన్నీ మీ ఫోను నంబరుతోనే ముడిపడి వుంటాయి. ఆ డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకుంటోంది. ఒకే సెల్‌లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోగానే సమాచారం షేర్‌ అయిపోతుంది.
4. వాట్సాప్‌ చెప్తున్నది: వాట్సాప్‌ గ్రూపుల గోప్యత పదిలంగా వుంటుంది.
వాస్తవం :
గూఢ లిపిలో పదిలపరుస్తారు గనుక గోప్యత పదిలం అని వాట్సాప్‌ వాదన. కాని మన వ్యక్తిగత అభిరుచులకు, ప్రాధాన్యతలకు, అభిప్రాయాలకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో వాట్సప్‌ ఇప్పటికే పంచుకుంటోంది. మన గ్రూప్‌లో చేరమని కొత్తవారిని ఆహ్వానించినప్పుడు మొత్తం గ్రూప్‌నే అందుబాటు లోకి తీసుకుని సెర్చి ఇంజన్లకు అప్పజెప్తుంది.
5. వాట్సాప్‌ చెప్తున్నది : కేవలం మనం వ్యాపారపరంగా జరిపే లావాదేవీలను మాత్రమే కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం పంచుకుంటుంది.
వాస్తవం :
దీనిని బట్టి మనం వాట్సాప్‌ ద్వారా జరిపే కార్యకలాపాలనన్నింటినీ వాట్సాప్‌ సేకరిస్తుంది. వాటిని వ్యాపారపరమైనవి, కానివి అంటూ విశ్లేషిస్తుంది. వ్యాపార సంబంధమైన వాటిని ఫేస్‌బుక్‌తో పంచుకుంటుంది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో జరిపే సంభాషణలను, తక్కిన వాటిని వేరు చేస్తుంది. వాటిని వ్యాపార సంబంధమైనవిగా పరిగణిస్తుంది. అంటే మొత్తం మన సంభాషణలన్నింటినీ అది పర్యవేక్షిస్తుంది. ఒక వైపు మన మీద డేగ కన్ను వేసి వుంచడానికి, మరోవైపు లాభాలు సంపాదించుకోడానికి మన గోప్యతను దెబ్బ తీస్తుంది.

                                                         * శశాంక్‌, ప్రబీర్‌ పురకాయస్థ (స్వేచ్ఛానుసరణ)