- రక్తమార్పిడిలో నిర్లక్ష్యం
- 14 మంది చిన్నారులకు హెచ్ఐవి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తమార్పిడి చేసే సమయంలో నిర్లక్ష్యం 14 మంది చిన్నారుల జీవితాలను ప్రమాదంలో పడేసింది. కలుషిత రక్తం ఎక్కించడం వల్ల చిన్నారులకు హెచ్ఐవి, హెపటైటిస్ బి, సి సోకినట్లు తేలింది. రాష్ట్రంలోని కాన్పూర్‌కు చెందిన లాలా లజపతిరారు ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన జరిగింది. 14 మంది బాధిత చిన్నారులు తలసేమియాతో బాధపడుతున్నారు. వీరికి ఎప్పటికప్పుడు రక్తమార్పిడి అవసరం. ఈ క్రమంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని లాలా లజపతిరారు ఆసుపత్రిలో రక్తమార్పిడి చేయించుకున్నారు. అయితే రక్త మార్పిడిలో నిర్లక్ష్యం వలన వీరిలో ఏడుమందికి హెపటైటిస్ బి, ఐదుగురికి హైపటైటిస్ సి, ఇద్దరికి హెచ్ఐవి సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ పిల్లలంతా ఆరు నుంచి 16 ఏళ్ల మధ్య వయసు వారే. ఇప్పటికే తలసేమియా తో బాధపడుతోన్న వీరిని ఈ వైరస్లు మరింత ఇబ్బందిపెడతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పిల్లలంతా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. ఈ దారుణంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. 'మన ఆరోగ్య వ్యవస్థను డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మరింత అనారోగ్యంగా మార్చింది. ఇంతటి దారుణమైన నిర్లక్ష్య వైఖరి సిగ్గుచేటు.' అని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.