కాన్పూర్ (ఉత్తర్‌ప్రదేశ్) : సినిమాలు చిన్నారులపై ఎంత ప్రభావం చూపుతాయో.... అందుకు తార్కాణంగా ఈ ఘటన జరిగింది. ఓ విద్యార్థి బాలీవుడ్ చిత్రాన్ని చూసి అందులో హీరోలాగా స్కూల్ భవనంపైనుండి కిందికి దూకాడు..!
ఏం జరిగిందంటే ... ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్ నగరాన వీరేన్ స్వరూప్ పాఠశాల పై అంతస్తు తరగతి గదిలో టీచరు పాఠం చెబుతుండగా ... 8 ఏళ్ల విద్యార్థి పైకి లేచి నీళ్లు తాగాలన్నాడు. టీచరు అనుమతి ఇవ్వడంతో వరండాలోకి వచ్చిన ఆ విద్యార్థి.. అమాంతం పైనుంచి కిందికి దూకేశాడు. ఈ ఘటనలో విద్యార్థి ముక్కుకు, కాళ్లూచేతులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడిని ఎందుకు స్కూలు భవనంపైనుండి దూకావు ? అని అడిగితే... హృతిక్ రోషన్ నటించిన ప్రముఖ బాలీవుడ్ చిత్రం 'క్రిష్' పాత్రను తాను అనుకరించానని, క్రిష్‌లా తాను కూడా క్షేమంగా కిందికి దిగుతానని భావించినంటూ... అమాయకంగా చెప్పాడు. ఈ సమాధానంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. విద్యార్థి దూకిన దృశ్యం పాఠశాల సీసీ టీవీ కెమెరాలో రికార్డయింది.