Sep 24,2023 13:01

ఘజియాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది.. రెండు అంతస్తుల భవనం కూలిపోయి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన శనివారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూప్‌నగర్‌ కాలనీ సమీపంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉదయం 11.30 గంటల సమయంలో ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్‌ పేలిపోయిందని బాధితులు తెలిపారు. మరోవైపు ఇంట్లో అక్రమంగా పటాకుల యూనిట్‌ నడుస్తోందని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు.. ఫోరెన్సిక్‌ నిపుణులు శిథిలాల మట్టి నమూనాలను సేకరించి, బాణాసంచా తయారు చేస్తున్నప్పుడు పేలుడు సంభవించిందా లేదా వంట గ్యాస్‌ సిలిండర్‌లో పేలుడు సంభవించిందా అనే విషయాన్ని నిర్ధారించడానికి వాటిని పరీక్షలకు పంపినట్లు డీసీపీ వివేక్‌ చంద్‌ యాదవ్‌ తెలిపారు. ఈ ఘటనలో మెవీస్‌ (45), ఆమె కుమారులు ఇమ్రాన్‌ (16), ఫర్దీన్‌ (18), షైస్తా (40), ఆమె కుమార్తెలు అలీనా (12), అలీషా (10), నోరీ (18) గాయపడ్డారని పోలీసులు తెలిపారు.. ఇమ్రాన్‌ అక్కడికక్కడే మతి చెందగా, గాయపడిన ఇతర వ్యక్తులను ఈశాన్య ఢిల్లీలోని జిటిబి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అక్కడ చికిత్స పొందుతూ.. అలీనా, అలీషా మృతి చెందినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురు వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వారు తెలిపారు.