న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో (యుపిఐటిఎస్)ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరుకానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ట్రేడ్ షోలో వివిధ దేశాల నుండి అతిథులు, పారిశ్రామిక వేత్తలు పాల్గనున్నారు. సుమారు రెండు లక్షలకు పైగా ప్రజలు సందర్శించే అవకాశం ఉందని అంచనావేశారు. మధ్యాహ్నం 3 నుండి 8 గంటల వరకు ప్రజలను అనుమతించనున్నట్లు వెల్లడించాయి.
దీంతో ఢిల్లీ సమీపంలోని గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 8వేల మంది పోలీసులతో పాటు 12కు పైగా పారామిలటరీ బృందాలు, సాయుధ దళాలను మోహరించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే 1300 మంది పోలీసులను ట్రాఫిక్ విధుల కోసం కేటాయించినట్లు వెల్లడించాయి. ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలని, గురువారం మధ్యాహ్నం 2 నుండి 8 గంటల వరకు నొయిడా-గ్రేటర్ నొయిడా జాతీయ రహదారిని వినియోగించవద్దని ప్రజలకు సూచించారు.