
ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా కార్పొరేటీకరణ అవుతున్న తరుణంలో... ప్రభుత్వ బళ్ళు ఇంకా కొద్దో గొప్పో ఉనికిని చాటుకుంటున్నాయంటే అది ఉపాధ్యాయ ఉద్యమ పోరాటాల ఫలితమేని నిస్సందేహంగా చెప్పొచ్చు. సమాజంలో అట్టడుగు వర్గాల చదువులకు సర్కారీ పాఠశాలలే పెద్ద ఆసరా. అలాంటి పాఠశాలలు ప్రైవేటీకరణకు ప్రభుత్వాల యంత్రాంగం చేసే దూకుడుకి ఎప్పటికప్పుడు కళ్ళెం వేస్తూ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు నిరంతరం పోరాటాలు చేసే 'ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం (యుటిఎఫ్)' నేడు 49వ వసంతంలోకి అడుగిడుతోంది.
యుటియఫ్ స్థాపించిన వెంటనే అత్యవసర పరిస్థితి వచ్చినా లెక్కచేయక ఉపాధ్యాయుల పక్షాన నిలిచింది. 'పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప' అనే నినాదంతో యుటిఎఫ్ చేసిన కృషికి సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయి.
'బతకలేక బడిపంతులు నుంచి బతుకులు తీర్చిదిద్దే వాడిగా' మార్పు చేయడంలో యుటిఎఫ్ అజేయమైన పాత్ర పోషించింది. 2007 తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో యుటియఫ్ బలపరిచిన ఎమ్మెల్సీలు 13 జిల్లాలకు ప్రాతినిధ్యం వహించడం ఇటు ఉపాధ్యాయ వర్గంలోనూ, అటు ప్రజాక్షేత్రంలో యుటిఎఫ్ కు వున్న పరపతి తెలుస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్లో అగ్రగామి సంఘంగా ఉంటూనే ఐక్య ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది. ఫ్యాప్టోలో, జెఏసిలో సెక్రటరీ జనరల్ కీలక బాధ్యతలు పోషిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల హక్కుల సాధనకు కృషి చేస్తోంది.
1975లో ప్రారంభమైన 'ఐక్య ఉపాధ్యాయ పత్రిక' విద్యా, ఉద్యోగ, ఉపాధ్యాయ, సామాజిక, ప్రాపంచిక పరిజ్ఞానంతో నేటికీ ఉద్యమాన్ని ముందుకు నడిపించే కరదీపికగా పనిచేస్తోంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఉపాధ్యాయులకు అందిస్తోంది. ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం వహించే ఐక్యఉపాధ్యాయ ప్రచురణల విభాగం నుండి 'అధ్యాపక దర్శిని' 1979 ఆగస్టులో మొదలైంది. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై యుటిఎఫ్ లక్ష సంతకాలు సేకరించి 1979 అక్టోబర్లో ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం సమర్పించింది. యుటిఎఫ్ చేపట్టిన ఈ కీలక ఘట్టంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో ఎన్నో మార్పులు చేయక తప్పలేదు. ప్రణాళికాబద్ధ బోధనకు ఉపాధ్యాయులకు చేతిలో పాఠ్య పుస్తకంతో పాటు 'డైరీ' కూడా అవసరమని తొట్టతొలిగా గుర్తించింది యుటిఎఫ్ సంఘమే. ఉపాధ్యాయులకు ఎంతో విలువైన సమాచారం అందించడంతో పాటు ప్రణాళికాబద్ధంగా బోధనకు సాయపడే డైరీని 1981 జనవరిలో యుటియఫ్ తొలిసారిగా ప్రచురించి ఆవిష్కరించింది.
కోవిడ్-19 నేపథ్యంలో ప్రైవేట్ స్కూల్ టీచర్లను, లెక్చరర్లను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని యుటిఎఫ్, పిడిఎఫ్ ఎమ్మెల్సీలే డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల విలీనంతో ప్రాథమిక స్థాయిలో పేదలకు బడి దూరం అవుతుందని, ప్రజా ఉద్యమానికి తెరలేపింది యుటిఎఫ్, పిడిఎఫ్ లే. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బడి కోసం బస్సు యాత్ర నిర్వహించి...తల్లిదండ్రుల ఆగ్రహ జ్వాలలను ప్రభుత్వానికి తెలియజేయడంలో యుటిఎఫ్, పిడిఎఫ్ శ్లాఘనీయమైన పాత్ర పోషించింది. ఉద్యోగుల కనీస హక్కు సాధారణ పెన్షన్ కోసం ఆదినుంచి పోరాటం చేసింది యుటిఎఫ్. మరుగున పడ్డ సిపిఎస్ రద్దు ఉద్యమానికి దిశానిర్దేశం చేసింది కూడా ఈ సంఘమే.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవా దృక్పథంతో బాధితులను ఆదుకోవడంలో తన వంతు కర్తవ్యం నిర్వహిస్తోంది యుటిఎఫ్. కరోనా సమయంలో నిత్యవసర వస్తువులు అందించి వేలమంది బాధితులను ఆదుకుంది. ప్రతి జిల్లాలోనూ స్వచ్ఛందంగా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్య సదుపాయాలు కూడా అందించింది. ఇటీవల సంభవించిన వరదలకు నిరాశ్రయులైన వారికి కూడా ఇతోధిక సాయం చేసింది. అట్టడుగు వర్గాల అక్షర తేజం కోసం కృషి చేస్తున్న ఐక్య ఉపాధ్యాయ సంఘం పుట్టినరోజు అభినందనలు.
- చిలుకూరి శ్రీనివాసరావు, సెల్ : 8985945506