Nov 05,2023 21:45

- యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ సభలో ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డివి శంకర్రావు
ప్రజాశక్తి - పార్వతీపురం:ఉపాధ్యాయుల హక్కులు, సమాజ శ్రేయస్సు కోసం ముందుండి యుటిఎఫ్‌ పోరాటాలు చేస్తోందని ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డివిజి శంకరరావు అన్నారు. యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాలు పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఆవరణలో ఆదివారం జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా శంకరరావు పాల్గోని మాట్లాడారు. ఉపాధ్యాయ హక్కుల కోసం పోరాడుతూనే సమాజం మార్పు చెందాలని, అందుకు కొంత సమయాన్ని పేద విద్యార్థుల బోధనలకు కేటాయిస్తామని ప్రకటించినందుకు యుటిఎఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు. గిరిజన విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనలోనూ, ఉపాధ్యాయుల సమస్యలపైనా తన పరిధిలో సాధ్యపడినంత సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠ్యాంశాల్లో ఉన్న సారాంశంతోపాటు సమాజాన్ని చదివే భావజాలాన్ని విద్యార్థులకు అందించాలని, ఆ బాధ్యత యుటిఎఫ్‌పైనే ఉందని తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర మాట్లాడుతూ టిడిపి హయాంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంతో ప్రాధాన్యనిచ్చిందని, ప్రస్తుత వైసిపి ప్రభుత్వం పూర్తిగా విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందని విమర్శించారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చెన్నుపాటి లక్ష్మయ్య, అప్పాజీ వెంకటస్వామి, రామిరెడ్డి, శేషగిరి, గీత వంటి అమరులైన వారి ఆదర్శ భావాలు, పోరాట త్యాగాలు మనకు ఆదర్శం కావాలన్నారు. మన్యం ప్రాంతంలో గిరిజన విద్యాభివృద్ధికి రానున్న రోజుల్లో ఐక్య పోరాటాలు చేయాలని కోరారు. జెఎసి జిల్లా చైర్మన్‌ కిషోర్‌ మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దు కోసం యుటిఎఫ్‌ నిత్యం పోరాటాలు చేస్తుందని, జెఎసి తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాని తెలిపారు. ఈ ఉత్సవాల్లో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌.రవీంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రమేష్‌, ఎస్‌.మురళీమోహన్‌రావు, ఉపాధ్యాయులు పాల్గన్నారు. ఉత్సవాలకు ముందు డిఇఒ కార్యాలయం నుంచి సభా ప్రాంగణం వరకూ ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు.