Oct 15,2023 21:52

- మహిళలకు ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలె పిలుపు
ప్రజాశక్తి- తిరుపతి సిటి:రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు ఈ దేశానికి రక్షణ అని ప్రత్యేకించి మహిళా రక్షణ కోసం రాజ్యాంగం రూపొందించిన హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ మహిళ మీద ఉందని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావలె పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా అశోక్‌ కన్వెన్షన్‌ హాల్‌లో యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు ఎఎన్‌ కుసుమ కుమారి అధ్యక్షతన యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహిళా కన్వెన్షన్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మరియం దావలె హాజరై మాట్లాడారు. మనుస్మృతి పేరుతో మహిళలను కించపరుస్తూ పాలకులు మాట్లాడుతున్నారని, కులం, మతం, ప్రాంతం, ధనిక, పేద సంబంధం లేకుండా వారిని వివక్షకు గురిచేస్తున్నారని తెలిపారు. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయని, దీనిలో ప్రధానంగా చట్టం ముందు అందరూ సమానమని తెలిపారు. కానీ నేడు చట్టం ముందు కాదు కదా సమాజంలో మహిళలు సమానంగా చూడడానికి కూడా పాలకులు అంగీకరించడంలేదని అన్నారు. మహిళలను రెండవ తరగతి పౌరులుగా చూసేటువంటి మనుస్మృతిని తిరస్కరించాలని కోరారు. ప్రతి వెయ్యి మంది పురుషులకు 906 మంది మహిళలు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఇవాళ గర్భంలోనే బాలికలను చంపేసే భ్రూణహత్యలు జరగడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ మహిళా గర్భస్రావం చేయించుకోవడానికి ఇష్టపడదని, మగపిల్లలు కావాలని కుటుంబం ప్రత్యేకించి పురుషాధిక్యత సమాజం ఆ స్థితికి దిగజారుస్తుందని తెలిపారు. మహిళలకు ఆస్తి హక్కు ఉండడం ద్వారా మనోధైర్యాన్ని, ఆర్థిక స్వతంత్రాన్ని కలిగి ఉంటుందని, అలాంటి ఆస్తి హక్కు మహిళలకు లేకుండా చేస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని, మహిళ ఆస్తిహక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. నేటి పాలకులు హిందుత్వాన్ని ముందుకు తీసుకొస్తున్నారని, ఆ పేరుతో విభజన చేస్తున్నారని, తాము మతాలకు వ్యతిరేకం కాదని, కానీ ఉన్మాదతత్వాలకు కచ్చితంగా వ్యతిరేకమని తెలిపారు. ఎక్కడ ఎలాంటి అరాచకాలు జరిగినా అక్కడ మహిళలపై దారుణాలు జరగడం నిత్యకృతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలందరూ సమానం అనే భావన పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని కోరారు. భారత రాజ్యాంగం కల్పించిన లౌకిక విధానం, సమానత్వం, స్వేచ్ఛ భావనని విద్యార్థి దశలోనే విద్యార్థులకు చెప్పాలన్నారు. మనుస్మఅతి హఠావో మహిళలు, రాజ్యాంగం బచావో నినాదాన్ని అందుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సంయుక్త, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి, శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీ ఫ్రొఫెసర్‌ మధుజ్యోతి ప్రసంగించారు. యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ నిర్మాణ కర్తవ్యాలను, ఎస్‌టిఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి ఎన్‌ అరుణ కుమారి నివేదికను ప్రవేశపెట్టారు. అంతకు ముందు జాతీయ జెండాను యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎస్‌ నాయుడు, ఎస్‌టిఎఫ్‌ఐ జెండాను సంయుక్త, యుటిఎఫ్‌ జెండాను రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఎగురవేశారు.