
- దీక్షలను ప్రారంబించిన జెఏసి చైర్మన్ మురళి
- ఓపిఎస్ అమలు చేసే వారికి రాజకీయ మనుగడ
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పాత పెన్షన్ విధానం పునరుద్దరించాలని, సిపిఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరవధిక నిరాహార చేపట్టారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలను ఎపి జెఏసి జిల్లా చైర్మన్ జె.మురళి దీక్షలో కూర్చున్న వారికి పూల దండలు వేసి ప్రారంభించారు. దీక్షలను ఉద్దేశించి జెఏసి చైర్మన్ జె.మురళి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఓ పి ఎస్ అమలు విషయంలో ఉద్యోగులను మోసం చేశారన్నారు. 2004లో పెన్షన్ విధానం రద్దు చేసినప్పటి నుండి దేశవ్యాపితంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగైదు సంవత్సరాలుగా ఉద్యమం సమరశీలంగా నడుస్తున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిపిఎస్‌ను రద్దు చేస్తానని గత ఎన్నికల్లో హామీనిచ్చారని, ముఖ్యమంత్రి మోసపూరిత ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమన్నారు. సిపిఎస్ రద్దుకు చేస్తున్న పోరాటం న్యాయమైనదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిపిఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానం పునరుద్దరించాలని, ఈ ఆందోళనకు అన్ని సంఘాలు మద్దతు తెలపాలన్నారు. అనంతరం యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు,రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, డి.రాము, కే.శ్రీనివాసరావు,జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమేష్ చంద్ర పట్నాయక్, జె ఏ వి అర్ కె ఈశ్వరరావులు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాట ఇచ్చి మర్చిపోయారన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజులలో సిపీఎస్ ను రద్దు చేస్తాం అని చెప్పి ఐదేళ్లు అవుతున్నా రద్దు చేయకుండా జిపిఎస్ పేరుతో ఉద్యోగులను నమ్మించి మోసం చేశారన్నారు. జి పి ఎస్ మా కొద్దు ఓపిఎస్ అమలు చేయాలని లేకుంటే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వకుండానే సిపిఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయడం జరుగుతుందన్నారు. హామీ ఇచ్చి అమలు చేయని ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. లక్షలు మంది ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నా ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. నిరవధిక దీక్షలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు, రాష్ట్ర నాయకులు కె.విజయాగౌరి, డి.రాము, రాష్ట్ర కౌన్సిలర్ కె.శ్రీనివాసరావు,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జె.రమేష్ చంద్ర పట్నాయక్, జె ఏ వి అర్ కె ఈశ్వరరావు, సి హెచ్ తిరుపతి నాయుడు, యుటిఎఫ్ సిపి ఎస్ జిల్లా పి.రామ్ ప్రసాద్ విభాగం కన్వీనర్ లు కూర్చున్నారు. వారికి మద్దతుగా అధిక సంఖ్యలో ఉపాద్యాయులు పాల్గొన్నారు.కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు సత్య శ్రీనివాస్, కె.ప్రసాదరావు, రాజారావు, త్రినాధరావు, రాధబవాని, భాస్కరరావులు పాల్గొన్నారు.