Sep 04,2022 15:05

ప్రజాశక్తి-ఆనందపురం : బ్రతకలేక బడిపంతులు స్థాయి నుండి సమాజంలో ఉన్నతమైన జీవన స్థాయికి ఉపాధ్యాయులు ఎదగడంలో నాటి నుండి నేటి వరకు ఉపాధ్యాయుల పోరాటపటిమ, ఉద్యమ స్ఫూర్తి తప్ప పాలకుల దయా డాక్షిణ్యాలు కానేకాదు అని చెప్పడంలో సందేహం ఏమి లేదు. సంఘం పెట్టడానికి వీలు లేదు, సంఘం పెట్టే ప్రయత్నం చేస్తే మీ ఉపాధ్యాయ శిక్షణా ధ్రువ పత్రాలను రద్దు చేస్తాం అని హుకుం జారీ చేసిన నాటి పాలకులను ఎదిరించి, పోరాడి, సంఘం పెట్టుకునే హక్కుని సాధించిన ఘనత ఉపాధ్యాయ ఉద్యమానిది. నాటి నుండి నేటి వరకు పాలకులతో నిరంతరం పోరాటమే, ప్రతీ పోరాటంలో అంతిమ విజయం ఉపాధ్యాయ ఉద్యమానిదే, అంతటి పోరాట స్ఫూర్తిని ఉపాధ్యాయులలో రగిలించిన ఉద్యమ సారధి  ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. సంఘం పెట్టుకునే హక్కును సాధించిన పిదప అనేక కేడర్లు వారీగా, మేనేజ్మెంట్లు వారీగా రకరకాలుగా విడిపోయి ఉన్న ఉపాధ్యాయ సమాజాన్ని అన్ని కేడర్లు, మేనేజ్మెంట్లు ను కలుపుకుని 1974 ఆగస్టు 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గా ఆవిర్భావించి విశాల ఉద్యమాన్ని నిర్మించి, ఉపాధ్యాయులకు ఆర్ధిక ప్రయోజనాలైన రీగృపింగ్ స్కెల్,  apprenticeship విధానం రద్దు, ఉపాధ్యాయ బదిలీల లో కౌన్సిలింగ్ విధానం మొదలగు అనేక ప్రయోజనాలను, రాయితీలను సాధించిపెట్టడంలో యుటిఎఫ్ పాత్ర ప్రముఖమైనది. ఈ రాష్ట్రంలో అత్యధిక సభత్వం కల్గిన ఏకైక పెద్ద సంఘం ఉన్న యుటిఎఫ్ మిగిలిన సంఘాలను ఒక తాటిపైకి తీసుకువచ్చి, పూల దండ లో దారం వలె, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ఐక్య ఉద్యమాల సారధిగా యుటిఎఫ్ పేరుగాంచినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలపై, ఉపాధ్యాయుల గొంతును చట్టసభలలో గళమెత్తడానికి యుటిఎఫ్ మద్దతుతో ఎన్నిక కాబడిన 5గురు పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారు.