- జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు
ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్: పాత పెన్షన్ విధానం పునరుద్దరించాలని, సిపిఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో చిత్తూరులో చేస్తున్న నిరవధిక నిరాహారదీక్షకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు శిబిరం వద్ద మద్దతుగా సంఫీుభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004లో పెన్షన్ విధానం రద్దు చేసినప్పటి నుండి దేశవ్యాపితంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగైదు సంవత్సరాలుగా ఉద్యమం సమరశీలంగా నడుస్తున్నదని ఈ పోరాటానికి సిఐటియు మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ పోరాటాన్ని అణచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నదని ఈ నిరాహారదీక్ష ఇతర సంఘాలకు, రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిపిఎస్‌ను రద్దు చేస్తానని గత ఎన్నికల్లో హామీనిచ్చారని, తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హామీలు నెరవేర్చినట్లు ఇతను కూడా నెరవేరుస్తాడని ప్రభుత్వ ఉద్యోగులు నమ్మారని ఇప్పుడు తెలియక వాగ్దానం చేశానని ముఖ్యమంత్రి మోసపూరిత ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమన్నారు. ఉద్యోగులపట్ల విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని అన్నారు. సిపిఎస్ రద్దుకు చేస్తున్న పోరాటం న్యాయమైనదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిపిఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానం పునరుద్దరించాలని, ఈ ఆందోళనకు అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని కోరారు. సిపిఎస్ రద్దుపై అన్నిరాజకీయ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలని కోరారు.










