న్యూఢిల్లీ : భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసింది. జూన్, జులై, ఆగస్టు నెలల్లో రికార్డు స్థాయిలో 90,000కు పైగా వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం తెలిపింది. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో ఓ ప్రకటనను విడుదల చేసింది. పపంచవ్యాప్తంగా జారీ చేస్తున్న ప్రతి నాలుగు విద్యార్థి వీసాల్లో ఒకటి భారత్‌లోనే ఉంటుందని తెలిపింది.
'ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి అమెరికాను లక్ష్యంగా పెట్టుకొన్న భారతీయ విద్యార్థులకు శుభాకాంక్షలు. మా టీమ్‌వర్క్, సాంకేతికత సహాయంతో.. అర్హత పొందిన దరఖాస్తుదారులు సరైన సమయంలో ప్రవేశాలు పొందారని ఆశిస్తున్నాం' అని ఆ ప్రకటనలో పేర్కొంది.
2020లో సుమారు 2,07,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో ఉన్నత విధ్యను అభ్యసించేందుకు వెళ్లినట్లు నివేదికలు తెలిపాయి. గతేడాది అమెరికాకు వెళ్లిన విద్యార్థుల్లో చైనాను దాటి భారత్ ప్రథమస్థానంలో నిలిచినట్లు తెలిపింది. అంటే విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తాజా నివేదిక వెల్లడించింది.