Apr 29,2023 21:26
  • నమోదు క్రమాన్ని ఆధునీకరిస్తామన్న యుఎస్‌సిఐఎస్‌

వాషింగ్టన్‌ : హెచ్‌-1బి నమోదు క్రమాన్ని ఆధునీకరించాలని భావిస్తున్నట్లు అమెరికన్‌ ఫెడరల్‌ సంస్థ ప్రకటించింది.ఇందుకు తమ వద్ద ప్రణాళికలు వున్నట్లు తెలిపింది. నైపుణ్యాలు కలిగిన తమ విదేశీ ఉద్యోగుల కోసం వీసాలను పొందేందుకు తమకు గల అవకాశాలను కృత్రిమంగా మెరుగుపరుచుకునేందుకు కొన్ని అమెరికన్‌ కంపెనీలు మోసాలు, అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో రిజిస్ట్రేషన్‌ క్రమాన్ని మెరుగుపరచాలని భావిస్తున్నారు. హెచ్‌ా1బి వీసా నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా. సైద్ధాంతికంగా లేదా సాంకేతికంగా నైపుణ్యాలు అవసరమైన ప్రత్యేక వృత్తుల్లో అవసరమైతే విదేశీ సిబ్బందిని నియమించుకోవడానికి అమెరికన్‌ కంపెనీలను ఈ వీసా కింద అనుమతిస్తారు. దీని మీద ఆధారపడి భారత్‌, చైనా వంటి దేశాల నుండి ప్రతి ఏటా వందలు వేల సంఖ్యలో ఇటువంటి ఉద్యోగులను టెక్నాలజీ కంపెనీలు తీసుకుంటాయి. 2023, 2024 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి దాఖలైన హెచ్‌ా1బి వీసా దరఖాస్తులు సంఖ్యను పరిశీలిస్తే జరుగుతున్న మోసం, అక్రమాలు అర్ధమవుతున్నాయని యుఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యుఎస్‌సిఐఎస్‌) తెలిపింది. వీటిపై విస్తృతంగా దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది. లాటరీ వ్యవస్థలో ఒకే దరఖాస్తు దారు ఒకటి కన్నా ఎక్కువసార్లు దరఖాస్తు చేసుకుంటున్నట్లు కనుగొన్నామని యుఎస్‌సిఐఎస్‌ తెలిపింది.తమ ఉద్యోగుల కోసం వీసాను గెలుచుకునే అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ఆ కంపెనీలు ఇటువంటి తరహాలో మోసాలకు పాల్పడుతున్నాయని పేర్కొంది. 2023తో పోలిస్తే 2024 సంవత్సరానికి అమాంతంగా దరఖాస్తులు పెరిగిపోవడంతో అనుమానం వచ్చి దర్యాప్తు చేపట్టగా ఈ విషయాలు వెల్లడయ్యాయని తెలిపింది.