Oct 25,2023 07:45

కొలంబొ :    ఇకపై భారతీయులు ఉచిత పర్యాటక వీసాలతో శ్రీలంకలో పర్యటించవచ్చు. పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. భారత్‌తో పాటు మరో ఆరు దేశాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ఓ ప్రకటనలో తెలిపారు.   తక్షణమే అమల్లోకి రానున్న ఈ పైలెట్‌ ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. భారత్‌తో పాటు రష్యా, చైనా, మలేషియా, జపాన్‌, ఇండోనేషియా, థాయిలాండ్‌ దేశాల పర్యాటకులు ఎలాంటి రుసుము లేకుండా వీసాలను పొందవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. శ్రీలంక  ప్రధాన ఆదాయ వనరైన పర్యాటక రంగంపై . కొవిడ్‌ మహమ్మారితో పాటు ఆదేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో   తీవ్ర ప్రభావం పడింది. దీంతో పర్యాటక రంగానికి తోడ్పాటు నందించేందుకు శ్రీలంక ప్రభుత్వం  ఈ నిర్ణయం తీసుకుంది.  అధికారిక లెక్కల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్‌లో 30,000 మందికి పైగా భారత పర్యాటకులు శ్రీలంకను సందర్శించారు. చైనాపై 26 శాతం అధికంతో భారత్‌ ప్రధమ స్థానంలో నిలవగా, 8,000 మంది పర్యాటకులతో చైనా రెండో స్థానంలో నిలిచింది.