కొలంబొ : తమ దేశం ఆర్థికసంక్షోభం నుండి ఇప్పటికీ బయటపడలేదని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే పేర్కొన్నారు. సోమవారం తమ ప్రభుత్వ బడ్జెట్ -2024ను ప్రవేశపెట్టారు. రణిల్ ఆదేశ ఆర్థిక మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2022లో 70 శాతం ఉన్న ద్రవ్యోల్బణం ఈ ఏడాది అక్టోబర్‌లో 1.5 శాతానికి తగ్గించగలిగామని అన్నారు. దేశం ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేవరకు కఠినమైన సంస్కరణలను అమలు చేయాల్సి వుందని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ 2024 ఎన్నికల బడ్జెట్ కాదని.. అందుకే జనాకర్షక పథకాలను ప్రకటించలేదని అన్నారు. శ్రీలంక అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించగలిగినప్పటికీ.. ఆర్థికవ్యవస్థ సంక్షోభం నుండి పూర్తిగా కోలుకోవాల్సి వుంది. పట్టాలు తప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టగలిగామని, అయితే ఇప్పటికీ ప్రజలు కష్టాలను అనుభవిస్తున్నారని అన్నారు.
రెవిన్యూలోటును ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం రుణ వడ్డీగా 220 బిలియన్లు చెల్లించాల్సి వుండగా, నెలవారీ రాష్ట్ర వ్యయ లోటు రూ. 168 బిలియన్లు మిగిలి ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలను పూడ్చేందుకు రెండు బ్యాంకులను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ రెండు బ్యాంక్‌ల షేర్లను ప్రజలకు మరియు పెట్టుబడిదారులకు జారీ చేయాలని ఆయన ప్రతిపాదించారు. అయితే బ్యాంకుల స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం నగదును జమ చేయాల్సి వుందని చెప్పారు.