- సుమారు రూ.368 కోట్లు నష్టపోయిన బాధితులు
- 36 అకౌంట్లు ఫ్రీజ్, 11 మంది అరెస్ట్
ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విశాఖలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా వ్యవహారం బట్టబయలైంది. బాధితులు రూ.368 కోట్ల మేర నష్టపోయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు 11 మందిని అరెస్టు చేసి, 36 అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. విశాఖ నగరానికి చెందిన ఎర్ర సత్తిబాబు తన మిత్రుడు సూరిబాబు మాటలు నమ్మి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.8 లక్షలు నష్టపోయానని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ డిసిపి శ్రీనివాసరావు శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం...
నగరానికి చెందిన ఎర్ర సత్తిబాబు నుంచి అందిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. 63 బ్యాంక్ అకౌంట్ల ద్వారా రూ.367,62,97,000 లావాదేవీలు ఈ బెట్టింగ్‌ల నేపథ్యంలో జరిగినట్టు గుర్తించారు. ఈ క్రమంలో కీలక నిందితుడైన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి చెందిన రెడ్డి సూరిబాబుతోపాటు మరో పది మందిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. 14 ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఐపిఎల్ మ్యాచ్‌ల సమయంలో సూరిబాబు 20 నుంచి 30 మంది వ్యక్తుల నుంచి అమౌంట్ కలెక్ట్ చేసేవాడు. సంవత్సరానికి రూ.5 కోట్లు నుంచి రూ.6 కోట్లు బిజినెస్ టర్నోవర్ జరిగేలా చూసేవాడు. సేకరించిన మొత్తాన్ని సూర్యాబాగ్‌కు చెందిన టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు దినేష్ కుమార్‌కు పంపేవాడు. అందుకుగాను సూరిబాబుకు రెండు శాతం కమీషన్ దక్కేది. ఈ విధంగా తనకు తెలిసిన వ్యక్తులను బుకీలుగా మార్చి కమీషన్ కోసం బెట్టింగ్ నిర్వహించేలా ఆయన ప్రేరేపించేవాడు. సర్వర్‌లోని లోపాలను గుర్తించి డబ్బులు పెట్టిన వారికి నష్టం వచ్చేలా, ఓడిపోయే జట్లపై ఎక్కువ మొత్తంలో బెట్టింగ్ వేసేలా బుకీలు పథకాలు రచించేవారు. ఈ విషయం తెలియక ప్రజలు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి నష్టపోయేవారు. ఒకవేళ ఎవరైనా డబ్బులు గెలుచుకున్నా, యాప్‌లలోని వారి ఖాతాను బ్లాక్ చేసి నకిలీ పత్రాలతో ఓపెన్ చేసి సేవింగ్స్ అకౌంట్‌కు ఆ నగదును జమ చేసి అక్కడి నుంచి కొన్ని కార్పొరేట్ అకౌంట్లకు బదిలీ చేసేవారు. ఈ బెట్టింగ్ రాకెట్ వ్యవహారం బట్టబయలైన తరువాత ప్రధాన నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటివరకూ అరెస్టయిన వారిలో రెడ్డి సూరిబాబు, బర్రి శీను, గుర్రం శివ, కిలాడి శ్రీనివాసరావు, అల్లు నూకరాజు, వురిటి కొండబాబు, పురిటి వెంకటేశ్వర్లు, సుందరపు గణేష్, ధూళి నూకరాజు, హండ దినేష్ కుమార్, వుప్పు వాసుదేవరావు ఉన్నారు. వీరంతా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందినవారు.