వాషింగ్టన్ : భారతీయ విద్యార్థి జాహ్నవి కందుల మృతిపై సీటెల్ నగర మేయర్ బ్రూస్ హారెల్ క్షమాపణలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుల జాహ్నవి ఈ ఏడాది జనవరి 23న సీటెల్‌లో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మృతి గురించి సీటెల్ పోలీస్ అధికారి డానియల్ ఆర్థర్ చులకనగా మాట్లాడిన ఘటన ఈ నెల 14న వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజాగా జాహ్నవి మరణంపై సీటెల్ నగర మేయర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారి డానియల్ ఆర్థర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన భారత సమాజానికి క్షమాపణ చెప్పారు. ఈ దురదృష్ట సంఘటన, అనుచిత వ్యాఖ్యలతో భారత సమాజం ఏకమైందని, నగర అధికారులు భారత కమ్యూనిటీకి, జాహ్నవి మరణానికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నామని బ్రూస్ హారెల్ తెలిపారు. సీటెల్ పోలీస్ చీఫ్ ఆడ్రియన్ డియాజ్ కూడా జాహ్నవి మృతికి సంతాపం తెలిపారు. ఇండియన్ కమ్యూనిటీకి చెందిన 20 మంది ప్రముఖులతో సీటెల్ మేయర్, పోలీస్ చీఫ్ శనివారం సమావేశమయ్యారు. పొరుగువారిని రక్షించే, గౌరవించే సీటెల్ నగరాన్ని రూపొందిస్తామని వారు హామీ ఇచ్చారు. జాహ్నవి కందుల మరణంపై త్వరితగతిన న్యాయవిచారణ జరిపిస్తామని అమెరికా ప్రభుత్వం భారతదేశానికి హామీ ఇచ్చింది.