పారిస్ : ఫ్రాన్స్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పారిస్‌కు దక్షిణంగా ఉన్న పట్టణంలోని మేయర్ ఇంటిపైకి నిరసనకారులు శనివారం రాత్రి కారుతో దాడి చేశారు. తన కుటుంబం నిద్రిస్తున్న సమయంలో ఆందోళనకారులు కారుతో నివాసంలోకి దూసుకువచ్చారని, అనంతరం ఇంటికి నిప్పుపెట్టారని అన్నారు. ఈ దాడిలో తన భార్య, చిన్నారికి గాయాలైనట్లు లా హెలెస్ రోసెస్ పట్టణ మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. పది షాపింగ్ మాల్స్, 200కి పైగా సూపర్ మార్కెట్లు, 250 పొగాకు దుకాణాలు, 250 బ్యాంక్ అవుట్‌లెట్లపై దాడులు జరిగాయని ఆర్థిక మంత్రి బ్రూనో లీ మైర్ తెలిపారు. నిరసనకారులు గ్రిగ్నీలోని నివాస భవనానికి నిప్పుపెట్టినట్లు కూడా పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుండి కొనసాగుతున్న నిరసనలు, ఆందోళనల్లో గత ఐదురోజులుగా కొనసాగుతున్న అల్లర్లలో.. పోలీసులు ఇప్పటివరకు 4 వేల మంది నిరసనకారులను అరెస్టు చేశారు. . నిరసనకారులంతా టీనేజర్లేనని పోలీసులు చెప్తున్నారు. శాంతిని నెలకొల్పేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 1350కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. రోడ్లపై మొత్తంగా 2560చోట్ల భవనాలకు, వాహనాలకు నిప్పంటించారని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. గత మంగళవారం 17 ఏళ్ల యువకుడు నెహెల్ ను ట్రాఫిక్ పోలీసులు కాల్చిచంపడంతో ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.