పారిస్ : పాఠశాలల్లో అబయ ( బుర్ఖా తరహా ) దుస్తులు ధరించడంపై ఫ్రెంచ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మరికొన్ని రోజుల్లో పాఠశాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ఈ ప్రకటన విడుదల చేశారు. ''పాఠశాలల్లో విద్యార్థినులు ఇకపై అబయ ధరించకూడదని నేను ఆదేశించాను'' అని విద్యాశాఖ మంత్రి గాబ్రియేల్ అట్టల్ మీడియాతో అన్నారు. ''ఈ నిషేధంతో మీరు తరగతి గదిలోకి వెళ్లినప్పుడు విద్యార్థులను చూడటం ద్వారా వారు ఏ మతానికి చెందినవారు అన్న విషయాన్ని గుర్తించలేరు'' అని అన్నారు. ఫ్రెంచ్ పాఠశాలల్లో అబయ ధరించడంపై గత కొన్ని నెలలుగా చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం దుస్తులు మాత్రమే మతపరమైన సంకేతం కాదని ఫ్రెంచ్ కౌన్సిల్ ఆఫ్ ముస్లిం ఫెయిత్ (సిఎఫ్‌సిఎం) పేర్కొంది. ఈ చర్యను ఫ్రాన్స్ వామపక్ష నేతలు వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం మైనారిటీలపై మితవాదుల దాడిగా అభివర్ణించారు.
19వ శతాబ్దం నుండి విద్యా సంస్థల్లో మతపరమైన అంశాలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2004లో పాఠశాలల్లో హిజాబ్ ధరించడంపై నిషేధం విధించగా, 2010లో బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని కవర్ చేసే వస్త్రం (పరదా) ధరించకూడదని నిషేధం విధించింది. దేశంలో ముస్లిం మైనారిటీల సంఖ్య అధికమవుతుండటంతో... వారిని ఎదుర్కొనేందుకు ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ తరహా మార్గదర్శకాలను జారీ చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.