Aug 08,2023 15:23

గురుగ్రామ్‌ : హర్యానాలోని నుహ్ జిల్లాలో ప్రారంభమైన మత ఘర్షణలు ఆరుగురిని పొట్టునబెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఘర్షణలకు సంబంధం ఉన్న విహెచ్‌పి కార్యర్తలు గురుగ్రామ్‌లోని పిఆర్‌పిఎఫ్‌ చౌక్‌ సమీపంలోని ఓ మాంసం దుకాణంపై దాడి చేసినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఈ దుకాణం వద్దకు వచ్చిన పది పన్నెండు మంది విహెచ్‌పి కార్యకర్తలు ఆ దుకాణంపై రాళ్లు రువ్వారు. దీంతో దుకాణం కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అలాగే కర్రలతో దుకాణ యజమానిని కొట్టడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దుకాణ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐపిసి సెక్షన్‌ 323 (గాయం కలిగించడం), 147 (అల్లర్లు), 149 (చట్ట విరుద్ధమైన సమావేశాలు), 427 (నష్టం కలిగించడం) వంటి ఐపిసి సెక్షన్ల కింద సెక్టార్‌ 5 పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.