Sep 15,2023 12:13

చండీగఢ్‌  :  హర్యానాలోని  నుహ్  జిల్లాలో చెలరేగిన హింసాకాండ కేసులో బ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మమ్మన్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం అర్థరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నామని, కోర్టులో హాజరుపరచనున్నట్లు  నుహ్  ఎస్‌పి నరేంద్ర బిజర్నియా శుక్రవారం తెలిపారు. జులై 31న విహెచ్‌పి నిర్వహించిన జలాభిషేక్‌ యాత్ర సమయంలో నుహ్ లో  జరిగిన మత ఘర్షణల్లో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లు దక్షిణ హర్యానాలోని కొన్ని ప్రాంతాలకు కూడా విస్తరించాయి. ఈ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మమ్మన్‌ ఖాన్‌ హస్తం ఉందని హర్యానా పోలీసులు ఆరోపించారు.

అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించాకే ఎమ్మెల్యేను నిందితుడిగా పేర్కొన్నట్లు హర్యానా పోలీసులు వెల్లడించారు.  విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యేకు గతంలో రెండు సార్లు సమన్లు పంపామని, అయితే ఆయన విచారణకు హాజరుకాలేదని అన్నారు. నుహ్ లో  జరిగిన అల్లర్లకు కాంగ్రెస్‌దే బాధ్యత అని హర్యానా హోం మంత్రి అనిల్‌ విజ్‌ కూడా గతంలో రాష్ట్ర అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.

మమ్మన్‌ ఖాన్‌ ప్రస్తుతం ఫిరోజ్‌పూర్‌ జిర్కా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తన అరెస్ట్‌ను ముందే ఊహించిన మమ్మన్‌ ఖాన్‌ ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పంజాబ్‌- హర్యానా హైకోర్టులో మంగళవారం బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. హింస చెలరేగిన రోజున తాను నుహ్ లో  లేనని, తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని మమ్మన్‌ ఖాన్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ  పిటిషన్‌పై విచారణ అక్టోబర్‌ 19న జరగనుంది.