చండీఘర్ : కల్తీ మద్యం తాగి 19 మంది మరణించిన ఘటన హర్యాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు శనివారం తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో కాంగ్రెస్ నేత, జననాయక్ జనతా పార్టీ (జెజెపి) నేత కుమారులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. యమునానగర్, అంబాలాలోని పలు గ్రామాల్లో ఈ మరణాలు సంభవించాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మద్యం డీలర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే లిక్కర్ డీలర్స్ గురించి సమాచారం అందించేందుకు గ్రామస్తులు భయపడుతున్నారని అన్నారు. అంబాలా జిల్లాలో ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఇద్దరు కార్మికులు కల్తీ మద్యంతో గురువారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. అంబాలాలోని నిషేధిత ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న సుమారు 200 మద్యం డబ్బాలను సీజ్ చేశామని అన్నారు. మద్యం తయారికి వాడిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ని ఏర్పాటు చేసినట్లు యమునా నగర్ పోలీసులు ప్రక టించారు.
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. గతంలో ఇటువంటి ఘటనలు జరిగినా బిజెపి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.