Aug 30,2023 17:25
  • సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులకు ప్రశంస

న్యూఢిల్లీ: హర్యానాలోని బిజెపి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సిఐటియు తీవ్రంగా ఖండించింది. సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ఎదుర్కొంటున్న అణచివేత, పోలీసుల క్రూరత్వంపై సిఐటియు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరంకుశ చర్యలను వెంటనే విరమించాలనీ, రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతున్న నిరవధిక సమ్మెను ఉభయ పక్ష చర్చల ద్వారా పరిష్కరించాలని డిమాండ్‌ చేసింది.
ఈనెల 8 నుంచి రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెలో ఉన్న ఆశా వర్కర్లు హర్యానా ప్రభుత్వం నుంచి తీవ్ర అణచివేతను ఎదుర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వంతో నెలల తరబడి చర్చలు జరిపారు. అనేక ప్రయత్నాల అనంతరం చివరి ప్రయత్నంగా వారు సమ్మెకు దిగారు. దీనికి ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఎలాంటి స్పందనా తెలియజేయలేదు.
ఆశా వర్కర్లు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు రాష్ట్ర అసెంబ్లీ ముందు శాంతియుత ప్రదర్శన నిర్వహించడానికి ప్రయత్నించడంతో పరిస్థితి తీవ్రమైంది. దీనిపై రాష్ట్ర అధికారులు తీవ్రంగా స్పందించారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌, సిఐటియు హర్యానా రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు సురేఖ, ప్రధాన కార్యదర్శి జైభగవాన్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సునీతతో సహా నాయకులు వేధింపులకు, అరెస్టులకు గురయ్యారు. నిర్బంధంలో ఉన్న నాయకులకు తాగునీరు, విశ్రాంతి గదులు వంటి కనీస సౌకర్యాలు లభించకుండా అడ్డుకున్నారు. భయం, బెదిరింపు వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నంలో వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రూరమైన చర్యలు కొనసాగుతున్నప్పటికీ, ఆశా వర్కర్లు దృఢ నిశ్చయంతో తమ సమ్మెను కొనసాగించారు.
సిఐటియు హర్యానా బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తమ వైఖరిని పునరాలోచించుకోవాలని, కొనసాగుతున్న సమ్మెను పరిష్కరించడానికి వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేసింది. సమ్మె చేస్తున్న కార్మికులు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకుల ఆందోళనలను పరిష్కరించడానికి ప్రజాస్వామ్య ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించాలని తెలిపింది. సిఐటియు హర్యానాలోని ఆశా వర్కర్లకు సంఘీభావంగా నిలబడేందుకు కార్మికవర్గం, దాని అనుబంధ సంస్థల నుంచి మద్దతును కూడగట్టింది. ఈ సవాలు సమయంలో ఆశా కార్యకర్తలు ప్రదర్శించిన ధైర్యాన్ని, ఐక్యతను సిఐటియు ప్రశంసించింది.