Nov 13,2023 12:00

క్రిష్ణగిరి (కర్నూలు) : క్రిష్ణగిరి మండల పరిధి జాతీయ రహదారి-44 లోని అమకతాడు టోల్‌ ప్లాజాలో పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి టి.శివరాం, డోన్‌ పట్టణ, మండల అధ్యక్షులు నక్కీ శ్రీకాంత్‌, పి.రామాంజనేయులు, ప్రజా నాట్యమండలి జిల్లా నాయకులు కోయిలకొండ నాగరాజు, అమకతాడు టోల్‌ ప్లాజా వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అయ్యరాజు, రాజశేఖర్‌, కోశాధికారి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. సోమవారం టోల్‌ ప్లాజా మేనేజర్‌ వికాస్‌ విక్రమ్‌ సింగ్‌ తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... ఇటీవల కాలంలో సహకార్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ అనే కొత్త సంస్థ వచ్చిందని వారితో చర్చించి వేతనాలు పెంచుకున్నామన్నారు. అయితే ఒక నెల వేతనం దీపావళికి బోనస్‌ గా ఇవ్వవలసి ఉండగా దానిని ఇవ్వలేదన్నారు. ప్రధాన కార్యాలయం నుండి అనుమతులు వచ్చిన వెంటనే బోనస్‌ ఇస్తాము అని చెబుతూ వచ్చిన మేనేజర్‌ తీరా పై నుండి అనుమతులు రాలేదన్న కారణంగా ఇప్పటికిప్పుడు బోనస్‌ ఇవ్వలేమని చెప్పడం సరి కాదన్నారు. బోనస్‌ తో పాటు నలుగురు ఆపరేటర్లకు వేతనాలలో కొంత వ్యత్యాసం ఉన్నదని వారి సర్వీస్‌ సీనియార్టీ ప్రకారం అందరితో సమానంగా వారికి వేతనాలు వచ్చే విధంగా చూడాలని, అదేవిధంగా ఏడుగురు ఆపరేటర్లకు సీనియార్టీ ప్రకారం సూపర్వైజర్లుగా ప్రమోషన్స్‌ ఇవ్వవలసి ఉండగా ఇద్దరికి మాత్రమే ప్రమోషన్స్‌ ఇచ్చారని మిగతా 5 మందికి కూడా వెంటనే ప్రమోషన్స్‌ ఇవ్వాలన్నారు. చర్చల సందర్భంగా సానుకూలంగా స్పందించిన మేనేజరు యాజమాన్యంతో మరొకసారి చర్చించి అతి త్వరలో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. వారి హామీ మేరకు కొంత సమయం వేచి చూడాలని నిర్ణయించామని అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాలకు సిద్ధం అవుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు వెంకటేష్‌, ఆర్‌.కె.వి.రాజు, రాముడు, నాగేంద్ర, చాణక్య నాయుడు, మహేష్‌ నాయుడు, సోమశేఖర్‌ గౌడ్‌, వళి, మున్నీ బేగం, సిఐటియు నాయకులు అల్లా బకాష్‌, తదితరులు పాల్గొన్నారు.