Sep 03,2022 11:54

వాషింగ్టన్‌  :   తైవాన్‌కు 1.1 బిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధ ప్యాకేజీని అందించనున్నట్లు అమెరికా శుక్రవారం ప్రకటించింది. అమెరికా పార్లమెంటు దిగువ సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించిన నెలరోజుల అనంతరం అమెరికా తాజా ప్రకటన వెలుడటం గమనార్హం. ఈ ప్యాకేజీలో భాగంగా తైవాన్‌ భూభాగం వైపు వచ్చే క్షిపణులను ట్రాక్‌ చేయడంలో సహాయపడే ముందస్తు రాడార్‌ హెచ్చరిక వ్యవస్థ కోసం 665 మిలియన్‌ డాలర్లు, అలాగే ఓడలను ముంచే సామర్థ్యం కలిగిన 60 అత్యాధునిక హర్పూన్‌ మిసైల్స్‌ కోసం 355 డాలర్లను ప్రకటించింది. ఈ ప్యాకేజీ తైవాన్‌ భద్రతకు అత్యవసరమని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. తైవాన్‌పై ఆర్థిక, సైనిక, దౌత్యపరమైన ఒత్తిడిలను నిలిపివేయాలని, అలాగే తైవాన్‌తో చర్చల్లో పాల్గనాలని చైనాను కోరుతున్నామని అన్నారు. తైవాన్‌ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పలు సమస్యల శాంతియుత పరిష్కారానికి అమెరికా మద్దతు కొనసాగిస్తుందని చెప్పారు. పెలోసీ తైవాన్‌ పర్యటనను చైనా ప్రభుత్వం వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.