May 22,2023 21:38

ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : ఐక్యపోరాటాల ద్వారా ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత నాయకులు, సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ పరిరక్షణకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కర్నూలు ధర్నా చౌక్‌లో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్‌ అధ్యక్షతన సోమవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాలో బివి.రాఘవులు మాట్లాడుతూ వామపక్షాలు, పేదల పోరాట ఫలితంగా ఉపాధి హామీ చట్టం వచ్చిందని తెలిపారు. కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు ఈ చట్టం పోవాలని కోరుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి కార్మికులు పట్టణానికి వెళ్లేలా, చట్టాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. చేసిన పనికి డబ్బులు ఇవ్వకుండా ఈ చట్టాన్ని నాశనం చేయాలని చేస్తోందని, జగన్‌ ఢిల్లీ వెళ్లి చేతులు పిసుక్కుంటున్నారని, ఉపాధి కార్మికుల కూలి బకాయిల గురించి అడగడం లేదని, మోడీని అడిగే దమ్ము, ధైర్యం జగన్‌కు లేదని దుయ్యబట్టారు. ఉపాధి హామీ చట్టం వ్యవసాయ కార్మికుల హక్కని, దాని పరిరక్షణకు కేంద్రాన్ని ఎదురొడ్డి పోరాడాలని కోరారు. అదానీ, అంబానీలకు ఉపయోగపడే చట్టాలను అమలు చేస్తూ వారికి ఉపయోగపడని చట్టాలను తీసేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. అనంతరం ధర్నా చౌక్‌ నుండి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజనకు వినతిపత్రం అందజేశారు. పని ప్రదేశంలో పడి గాయపడిన చిన్న తుంబలానికి చెందిన ఈశ్వరమ్మ... రాఘవులును కలిశారు. తనకు ప్రభుత్వం నుంచి ఏ పరిహారమూ అందలేదని ఆమె తెలిపారు. వినతిపత్రం ఇస్తున్న సమయంలో ఆమె సమస్యను కలెక్టర్‌కు రాఘవులు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి.నారాయణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్‌.రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి అంజిబాబు, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గురుశేఖర్‌ తదితరులు పాల్గన్నారు.

upadi-hami-workers-protest-in-kurnool-bv-raghavulu-talk

 

upadi-hami-workers-protest-in-kurnool-bv-raghavulu-collector