ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : అంగన్వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి డిసెంబర్ 8 నుండి జరుగు సమ్మెకు ఉద్యోగులు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అంజిబాబు పిలుపునిచ్చారు .కర్నూలు అర్బన్ సిడిపిఓ ఆఫీస్ దగ్గర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు బాలదుర్గమ్మ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని లేదంటే ప్రక్క రాష్ట్రమైన తెలంగాణ లో ఇస్తున్నట్లు దానిపైన 1000 అదనంగా ఇవ్వాలని కోరారు. అధికారంలోకి రాకముందు తెలంగాణ కంటే అదనంగా ఒక వెయ్యి పెంచి ఇస్తానని చెప్పిన జగన్ నాలుగు సంవత్సరాలు అయినా ఇప్పటివరకు పెంచలేదని ఆయన విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని ఇవ్వాలని కోరారు .రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో భాగంగా జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని కోరారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 8 నుండి సమ్మెకు సిద్ధమవుతున్నట్లు వారు తెలియజేశారు. ఈ సమ్మెలో అంగన్వాడి కార్యకర్తలు అందరూ పాల్గొనాలని కోరారు. సమ్మెకు సంబంధించిన వినతి పత్రాలను సిడిపిఓ అనురాధ, పిడి వెంకట లక్ష్మమ్మ, ఆర్జేడి కార్యాలయంలోని ఏ సి డి పి ఓ ఉష లకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు పి నిర్మల ,ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి లలిత సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అంజిబాబు యూనియన్ నాయకులు రుక్మిణి టీఎస్ విజయ నాగమణి లలితమ్మ తదితరులు కలిసి అందజేసినట్లు వారు తెలియజేశారు.