Oct 29,2023 11:54

ప్రజాశక్తి ఆదోని : మున్సిప‌ల్ విద్యా వ్య‌వ‌స్థ ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ప్రభుత్వం స్పందించాల‌ని ఆంధ్రప్రదేశ్ పురపాలక ఉపాధ్యాయుల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, ఆదోని శాఖ ఆర్థిక కార్యదర్శి కోటన్న డిమాండ్ చేశారు. ఆదోనిలోని కార్యాల‌యంలో ఆదోని శాఖ ప్రధాన కార్యదర్శి జంగం బసవరాజు అద్యక్షతన జరిగిన ముఖ్య కార్యదర్శుల సమావేశం లో వారు మాట్లాడారు. మున్సిపల్ విద్యా వ్యవస్థలో మెరుగైన ఫలితాల కోసం పరిపాలన పర్యవేక్షణ నిమిత్తం విద్యా శాఖ అజమాయిషీలోకి తీసుకుని రావాలని ప్రతిపాద‌న‌ల‌పై ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇరవై నెలలుగా పురపాలక  విద్యా వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురికావడం జరుగుతుందన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, సర్వీస్ రూల్స్, జిపిఎఫ్, అర్బన్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు, పండిత పోస్టుల అప్ గ్రేడేషన్, అప్ గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుల, పాఠశాల సహాయకుల పోస్టుల మంజూరు, ఏపీపీఎస్సీ పరీక్షలు రాసేందుకు ఐదు సంవత్సరముల వయస్సు సడలింపు, డీఎస్సీ నియామకం, 398 స్పెషల్ టీచర్ల విషయం, తదితర సమస్యల పరిష్కారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంద‌న్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులు కూడా ఉద్యమ బాట పెడితే కానీ సమస్యలు పరిష్కారం కావా అనీ, విద్యా శాఖ అధికారులు మున్సిపల్ ఉపాధ్యాయులపై పెత్తనం తప్ప సమస్యల పరిష్కారం పై చిత్త శుద్ధి వహించడం లేదన్నారు. సమావేశం లో నాయకులు దస్తగిరి, నూర్ ఉల్ హక్, ఆనంద్, ప్రతాప్ రెడ్డి, మద్దయ్య, మహేష్, సుధాకర్ పాల్గొన్నారు.