ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర బడ్జెట్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి నిధులు తగ్గించటాన్ని నిరశిస్తూ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని సంఘ కార్యాలయం నుంచి శంకర్ విలాస్ సెంటర్ వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు మాట్లాడుతూ కేంద్రం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే కేంద్ర బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు కుదించారన్నారు. రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని, సంవత్సరానికి 150 రోజులు పని కల్పించి రోజుకు రూ.600లు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాటా ్లడుతూ గత బడ్జెట్‌లో రూ.1,11,000 కోట్లు కేటాయిం చారని, ఈ బడ్జెట్‌లో దాన్ని రూ.73వేల కోట్లకు కుదించా రన్నారు. రూ.38వేల కోట్లు కోత విధించారన్నారు. కోవిడ్ వల్ల వలస కార్మికులు పట్టణాల నుంచి గ్రామాల్లోని సొంత ఇళ్లకు వెళ్లారని, వారికి ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం ఉపాధి హామీకి నిధులు కుదించటం దారుణమన్నారు. సిఐటియు, రైతు సంఘం జిల్లా అద్యక్షులు డి.లక్ష్మి నారాయణ, కె.అజరు కుమార్, ఐద్వా జిల్లా కార్యదర్శి యల్.అరుణ ప్రసంగించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.శ్రీనివాస్, బి.ముత్యాలరావు, చింతల శ్రీనివాసరావు, షేక్.షకీలా, నికల్సన్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు యన్.కృష్ణ, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, వివిధ సంఘాల నాయకులు యం.కిరణ్, మనోజ్, ఎంఎ చిష్టీ, ఎన్.భావన్నారాయణ, యండి. అక్భర్ పాల్గొన్నారు.
నరసరావుపేట : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పట్టణాల్లోనూ ప్రవేశపెట్టాలని, బడ్జెట్‌లో నిధులు కోత పెట్టకుండా పెంచాలని పశ్చిమ గుంటూరు జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి అనుముల లక్ష్మీశ్వరరెడ్డి అన్నారు. ఉపాధి నిధులు పెంచాలని, 200 రోజులు పనులు, కనీస వేతనం రూ.600 చేయాలని డిమాండ్‌చేస్తూ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు నరసరావుపేట సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఓ చంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ రైతు సంఘం పశ్చిమ గుంటూరు జిల్లా అధ్యక్షులు గద్దె చలమయ్య మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లోని పేదలు పనుల కోసం సంచార జీవితం గడుపుతున్నారని, కొన్ని సందర్భాలలో ప్రమాదాల బారిన పడుతున్నారని ఫలితంగా వారి పిల్లలు చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ గుంటూరు జిల్లా అధ్యక్షులు కొమ్ముల నాగేశ్వరరావు, కౌలు రైతుల సంఘం పశ్చిమ గుంటూరు జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, కౌలు రైతుల సంఘం నర్సరావుపేట మండల కార్యదర్శి కోండ్రు ఆంజనేయులు, శ్రామిక మహిళ గుంటూరు జిల్లా సమన్వయ కమిటీ కన్వీనర్ డి.శివకుమారి, ప్రజానాట్య మండలి పశ్చిమ గుంటూరు జిల్లా కార్యదర్శి తాళ్లూరి పెద్దిరాజు, కాశీం, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి: కేంద్ర బడ్జెట్‌లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించడంపై స్థానిక బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు భీమిరెడ్డి కోటేశ్వరి, నాయకులు ఈ.కాటంరాజు, శివయ్య, గోపాల్ రెడ్డి, గండికోట బాబు వరప్రసాద్, విజయ పాల్గొన్నారు.
అమృతలూరు : ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొనిగల అగస్టీన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచాలని కోరుతూ ఎంపిడిఒ రావూరి జోషి రాజుకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మట్లపూడి థామస్, కె.రాజబాబు, యాజలి ప్రసాద్ పాల్గొన్నారు.
దుగ్గిరాల : ఉపాధిహామీ చట్టానికి కేంద్ర బడ్జెట్‌లో నిధుల కోతను నిరసిస్తూ స్థానిక ఎంపిడిఒకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు జెట్టి.బాలరాజు, వై.బ్రహ్మేశ్వరావు, టి.పరశురామారావు, బి.అమ్మిరెడ్డి, వి.సాంబశివరావు, ఎ.నీలాంబ్రం, వి.శేషగిరి పాల్గొన్నారు.










